ఏపీలో ప్రధాని మోడీ ఏం చెబుతారు?

ప్రస్తుతం ఏపీ ప్రజల, బీజేపీ, వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీల దృష్టి ప్రధాని మోడీ మీదికి మళ్లింది. ఇలా మళ్లడానికి కారణం ఆయన వచ్చే నెల పదకొండో తేదీన ఏపీకి రాబోతున్నారు. ప్రధానిలాంటి వ్యక్తి…

ప్రస్తుతం ఏపీ ప్రజల, బీజేపీ, వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీల దృష్టి ప్రధాని మోడీ మీదికి మళ్లింది. ఇలా మళ్లడానికి కారణం ఆయన వచ్చే నెల పదకొండో తేదీన ఏపీకి రాబోతున్నారు. ప్రధానిలాంటి వ్యక్తి వస్తున్నారంటే రాష్ట్రానికి యేవో వరాలు ఇస్తారని, యేవో సమస్యలు పరిష్కరిస్తారని ప్రజలు అనుకోవడం సహజం. రాజకీయ నాయకులైతే యేవో రాజకీయ పరిణామాలు జరుగుతాయని అనుకుంటారు. నిజానికి మోడీ సమస్యలు పరిష్కరించడానికో, రాజకీయాలు మాట్లాడటానికో రావడంలేదు. ఆయన అధికారిక అంటే ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనడానికి వస్తున్నారు.

జనం, రాజకీయ నాయకులు రకరకాల ఊహాగానాలు చేయడానికి కారణం మోడీ బహిరంగ సభలో ప్రసంగించడమే. అలాగే రాష్ట్ర బీజేపీ నాయకులతో సమావేశమవుతారు. దీన్నిబట్టి ఇన్ని ఊహాగానాలు చేస్తున్నారు. నవంబర్ 11 న వైజాగ్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ సహా అనేక పనులకు ప్రధాని శంకుస్థాపన చేస్తారు. దాదాపు 400 కోట్ల రూపాయలతో వైజాగ్ రైల్వే స్టేషన్ ను దేశం లోనే అత్యుతమ స్టేషన్ లలో ఒకటిగా రూపుదిద్దే ప్రక్రియకు ఆయన శంకుస్థాపన చేస్తారు. దాంతో పాటే విశాఖలో అనేక కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలలోనూ ఆయన పాలుపంచుకుంటారు. ఇక విశాఖ లోని బీజేపీ నేతలు ఎప్పటినుండో ఎదురుచూస్తున్న పార్టీ నూతన కార్యాలయ నిర్మాణానికి కూడా ప్రధాని మోదీ శంకుస్థాపన చేస్తారు . 

ఆయా కార్యక్రమాల అనంతరం ఆంధ్ర విశ్వవిద్యాలయం మైదానంలో ఏర్పాటు చేసే భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఇదే సమయంలో భోగాపురం విమానాశ్రయం, గిరిజన విశ్వవిద్యాలయం నిర్మాణ పనులకు ప్రధాని తో శంకుస్థాపన  చేయించేలా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ప్రధాని మోదీ విశాఖకు వస్తున్న సమయంలో, అదీ కూడా రైల్వే స్టేషన్ ఆధునికీకరణ కు సంబంధించిన విషయం కనుక ఆయన రైల్వే జోన్ పై కూడా స్పష్టత ఇస్తారా? అనే దానిపై రాష్ట్ర ప్రజలలో ఉత్కంఠ నెలకొంది. విశాఖ ప్రజల సెంటిమెంట్ వైజాగ్  స్టీల్ కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చెయ్యొద్దు అంటూ ఉక్కు కర్మాగారం కార్మికులు, ఉద్యోగులు నిరసనలు తెలియజేస్తూనే ఉన్నారు.

ఈ క్రమంలో విశాఖలో ప్రధాని మోదీ అడుగుపెడుతున్న వేళ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ రద్దుపై అనుకూలంగా స్పందిస్తారా అని ఉత్తరాంధ్ర ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇక రాజకీయాలకు వస్తే ప్రధాని పర్యటన సమయంలో అమరావతి రైతులు కలిసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక, పార్టీ నేతలకు ప్రధాని మూడు రాజధానులు – పొత్తుల అంశం పైన స్పష్టత ఇస్తారని పార్టీల నేతలు అంచనా వేస్తున్నారు. ఆ తరువాత టీడీపీ -బీజేపీ- జనసేన పొత్తు వ్యవహారం తేలే అవకాశం కనిపిస్తోందని అంటున్నారు. దీంతో, ప్రధాని పర్యటన ఏపీ భవిష్యత్ రాజకీయాల పైన క్లారిటీ ఇచ్చే ఛాన్స్ ఉండటంతో మోదీ విశాఖ టూర్ మరింత ఆసక్తి పెంచుతోంది.

అధికారిక కార్యక్రమాలతో పాటుగా పార్టీ నేతలతోనూ ప్రధాని సమావేశం అవుతారని సమాచారం. బహిరంగ సభలోనూ పాల్గొంటున్నారు. ఇదే సమయంలో పార్టీ నేతలకు ప్రధాని దిశా నిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రధాని విశాఖ పర్యటనకు ముందే తెలంగాణలో మునుగోడు ఫలితం వెల్లడి కానుంది. దీంతో, ఏపీలో పార్టీ భవిష్యత్ పైన ప్రధాని ఏం చెప్పబోతున్నారనేది ఆసక్తి కరంగా మారుతోంది. 2019 ఎన్నికల ప్రచారంలో భాగంగా నాడు ప్రధాని మోదీ టీడీపీ లక్ష్యంగా విమర్శలు చేసారు. 2019 ఎన్నికల్లో జగన్ సీఎం అయిన తరువాత రాజకీయంగా ఏపీలో ప్రధాని మోదీ రాజకీయ సభల్లో పాల్గొనలేదు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా అమరావతికి మద్దతుగా రైతుల యాత్రలో పాల్గొనాలని సీఎం జగన్ నిర్ణయానికి వ్యతిరేకంగా నిర్దేశించారు.

అదే సమయంలో ఏపీ బీజేపీలోని ముఖ్య నేతల్లో పొత్తుల పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. చంద్రబాబుతో కలిసిన పవన్ తోనూ పొత్తు అవసరం లేదని కొందరు చెబుతుంటే, పార్టీ బలోపేతం కావలంటే మూడు పార్టీలు కలిసి ఉండటం మంచిదనే అభిప్రాయం మరి కొందరు వ్యక్తం చేస్తున్నారు. కానీ, బీజేపీ ముఖ్య నాయకత్వం మాత్రం టీడీపీ గతంలో తమతో వ్యవహరించిన తీరు పైన ఇంకా ఆగ్రహంగానే ఉన్నారని, పొత్తుకు ఛాన్స్ లేదని కమలం పార్టీ కీలక నేతలు చెబుతున్నారు. ఎవరి ఊహాగానాలు ఎలా ఉన్నా ప్రధాని బహిరంగ వేదికపై రాజకీయాలు మాట్లాడక పోవొచ్చు. 

విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ గురించి, రైల్వే జోన్ గురించి కూడా మాట్లాడకపోవచ్చు. వాటి గురించి పార్లమెంటులో చాలాసార్లు చెప్పారు. ఇక టీపీపీ-జనసేన-బీజేపీ పొత్తు గురించి కూడా ఢిల్లీలో చర్చిస్తారేమోగానీ రాష్ట్ర బీజేపీ నాయకులతో మాట్లాడకపోవొచ్చు. అధికారిక కార్యక్రమాలకే పరిమితం కావొచ్చు.