భారీ నిర్మాణాలకు, మానవ నిర్మిత అద్భుతాలకు వేదిక చైనా. ఏదో కనువిందుగా ఉండే నిర్మాణాల సంగతి అంటుంచితే.. ప్రజలకు ఉపయుక్తమైన భారీ నిర్మాణాలు మాత్రం మానవ ప్రగతికి చిహ్నాలుగా నిలుస్తాయి. అలాంటి వాటిల్లో ఒకటి చైనాలోని త్రీ గోర్జెస్ డ్యామ్. హూబే ప్రావీన్స్ లో యాంగ్జూ నది మీద ఉండే ఈ డ్యామ్ ప్రపంచంలోనే అతి భారీ బహుశార్ధకసాధక ప్రాజెక్టుగా పేరు పొందింది. 1994లో దీని నిర్మాణాన్ని ప్రారంభించి, 2003లో దీని నిర్మాణాన్ని పూర్తి చేసింది చైనా. అప్పటి నుంచి అతి భారీ బహుళార్ధక సాధక ప్రాజెక్టుగా ఇది నిలుస్తూ ఉంది.
అయితే త్రీ గోర్జెస్ భారీ తనం మరి కొన్నాళ్లు మాత్రమే నంబర్ వన్ పొజిషన్లో ఉండబోతోంది. అంతకు మించి భారీ బహుళార్థక సాధక ప్రాజెక్టుగా నిలవబోతోంది పోలవరం. 35 లక్షల క్యూసెక్యుల వరద నీటి సామర్థ్యంతో ఉంటుంది త్రీగోర్జెస్ డ్యామ్. పోలవరం సామర్థ్యం ఏకంగా 50 లక్షల క్యూసెక్కులు! ఇలా పోలవరం చైనాలోని ప్రపంచ ప్రసిద్ధి చెందిన త్రీగోర్జెస్ డ్యామ్ ఫీట్ ను దాటేయనుంది.
అంతే కాదు.. పోలవరం ప్రాజెక్టు పూర్తైతే దాని ద్వారా ఏకంగా 38.70 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని అంచనా. గ్రావిటీ ద్వారానే కొన్ని లక్షల ఎకరాల భూమికి సాగునీటిని అందించడానికి వీలవుతుందని అంచనా. ఈ రకంగా అత్యంత గరిష్ట ఆయకట్టుతో పోలవరం ప్రాజెక్టు రికార్డు సృష్టించే అవకాశం ఉంది. అయితే ఈ ప్రాజెక్టుకు ఇప్పటి వరకూ ఎన్ని అవాంతరాలు ఎదరయ్యాయో వేరే వివరించనక్కర్లేదు.
కానీ 2021కు పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని జగన్ ప్రభుత్వం నొక్కి వక్కాణిస్తూ ఉంది. 2021 డిసెంబర్ కల్లా పోలవరం ప్రాజెక్టు పూర్తి అవుతుందని సాగునీటి శాఖా మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మరోసారి బల్లగుద్ది చెప్పారు. 2022 జూన్ నాటికి ఆయకట్టుకు నీటిని అందించడం ద్వారా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పోలవరం ప్రాజెక్టును ప్రారంభిస్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ భారీ బహుళార్థక సాధక ప్రాజెక్టు మీదే ఆంధ్రుల ఆశలెన్నో ఉన్నాయి. మరో రెండు సంవత్సరాల్లో అయినా అవి నెరవేరితే అంతకన్నా కావాల్సింది లేదు!