టైగర్ పై భక్తిశ్రద్ధలు చాటిన తమిళ సర్కార్

పెద్ద హీరోల సినిమాలకు సంబంధించి తమిళనాడు సర్కారు సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇకపై బడా హీరోల సినిమాలేవీ ఉదయం ఆటతో మొదలవ్వకూడదనేది ప్రభుత్వ నిర్ణయం. మొన్న వచ్చిన జైలర్ నుంచి, నిన్న…

పెద్ద హీరోల సినిమాలకు సంబంధించి తమిళనాడు సర్కారు సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇకపై బడా హీరోల సినిమాలేవీ ఉదయం ఆటతో మొదలవ్వకూడదనేది ప్రభుత్వ నిర్ణయం. మొన్న వచ్చిన జైలర్ నుంచి, నిన్న వచ్చిన లియో, తాజాగా వచ్చిన జపాన్ వరకు పెద్ద సినిమాలన్నీ ఇదే పద్ధతి ఫాలో అయ్యాయి.

ఈ సినిమాల ఎర్లీ మార్నింగ్ షోలు అన్నీ పొరుగు రాష్ట్రాల్లో పడ్డాయి. పాపం, అభిమానులు మాత్రం ఉదయం 9 గంటల నుంచి తమ అభిమాన హీరోల సినిమాల్ని చూడాల్సి వచ్చింది. ఈ రూల్ ను ఎవ్వరూ మార్చలేరనే విషయం హీరోలతో పాటు, అభిమానులకు కూడా అర్థమైపోయింది. ఎందుకంటే, హైకోర్టు కూడా దీనిపై స్పందించలేదు.

సరిగ్గా ఇలాంటి టైమ్ లో వచ్చింది టైగర్-3 సినిమా. దేశవ్యాప్తంగా ఈ సినిమాను ఉదయం 7 గంటల నుంచే ప్రసారం చేస్తామని మేకర్స్ ఆర్భాటంగా ప్రకటించారు. ఆడియన్స్ స్పాయిలర్స్ ఇవ్వకుండా ఉండేందుకు, ప్రపంచవ్యాప్తంగా ఒకే టైమ్ లో సినిమాను ప్రసారం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.

చెప్పినట్టుగానే దేశవ్యాప్తంగా ఉదయం 7 గంటల ఆటలతోనే టైగర్-3 సినిమా మొదలైంది. కానీ ఆశ్చర్యంగా తమిళనాడులో కూడా ఈ సినిమాకు ఉదయం ఆటలు కేటాయించారు. ఇదే ఇప్పుడు విజయ్, రజనీకాంత్ అభిమానుల ఆగ్రహానికి కారణమైంది. తమ హీరోల సినిమాలకు ఇవ్వని ప్రత్యేక అనుమతులు, సల్మాన్ ఖాన్ సినిమాకు ఎలా ఇచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తమిళనాట కొన్ని మల్టీప్లెక్సుల్లో ఉదయం 7 గంటల 10 నిమిషాలకు టైగర్-3 షోలు పడ్డాయి. ఈ మేరకు బుక్ మై షో టికెటింగ్ యాప్ లోని స్క్రీన్ షాట్స్ ను విజయ్, రజనీకాంత్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.

నిజానికి పనిదినాల్లో ప్రత్యేక అనుమతులు ఇవ్వకూడదని తమిళనాడు సర్కార్ నిర్ణయించింది. టైగర్-3 సినిమా ఆదివారం రిలీజైంది కాబట్టి, ఆ నిబంధన ఈ సినిమాకు వర్తించదని అంటున్నారు కొంతమంది. అయితే అలాంటి క్లాజ్ ఏదీ లేదంటున్నారు అభిమానులు. ప్రభుత్వం ఎలాంటి క్లారిటీ ఇస్తుందో చూడాలి.