విజయసాయిరెడ్డికి మరో పేరు విశాఖ రెడ్డి. అంతలా ఆయన విశాఖతో అనుబంధం పెంచుకున్నారు. 2015 నుంచి ఆయన విశాఖలోనే నివాసం ఏర్పాటు చేసుకుని ఇక్కడ పార్టీ వ్యవహారాలు చూస్తున్నారు. అంతే కాదు, ఆయన రాజ్యసభ సభ్యుడయ్యాక నోడల్ జిల్లాగా విశాఖను చేసుకుని తన నిధులు మొత్తం ఇక్కడే ఖర్చు చేస్తున్నారు.
వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత విజయసాయిరెడ్డి పాత్ర విశాఖలో ఇంకా ఎక్కువగా పెరిగింది. విశాఖ రాజధాని అన్న సంగతి వైసీపీలో జగన్ తరువాత తెలిసిన రెండవ వ్యక్తిగా విజయసాయిరెడ్డినే చెబుతారు. అయితే విశాఖ రాజధాని అంటే ఇక్కడ భూములకు ఒక్కసారిగా రెక్కలు వచ్చేస్తాయి. బడా బాబులు వాలిపోతారు. బినామీలు చెలరేగిపోతారు. అమరావతిలో జరిగినట్లుగానే ఇన్సైడింగ్ ట్రేడింగ్ జరుగుతుంది అన్న విమర్శలకు ఒడుపుగా చెక్ పెట్టారు విజయసాయి.
ఒక అంగులం జాగా ఆక్రమణ జరగకుండా ఆయన రాజధాని సీక్రెట్ ని ఆలా ఉంచారు. ఇక జగన్ నిండు అసెంబ్లీలో ప్రకటించాక విశాఖ రాజధాని అన్నది అందరికీ తెలిసింది. ఆ తరువాత భూదందాలకు బినామీ గద్దలు కొన్ని రెడీ అయిపోయాయి. వారూ వీరూ అన్న తేడా లేకుండా పార్టీలకు అతీతంగా భూముని చాప చుట్టేందుకు విశాఖలోనూ రంగం సిధ్ధం చేసుకున్నారు.
గతంలో తెలుగుదేశం హయాంలో భూదందాలు చేసిన వారు, గతానుభవంతో ముందుకు వచ్చారు. వారి వెనక నాడు రాజకీయంగా చక్రం తిప్పిన పెద్దలు, రాజకీయ ఆసాములూ, బడా పెత్తందార్లు కూడా ఉన్నారు. అయితే వీరందరికీ ప్రధాన అడ్డంకి విజయసాయిరెడ్డి. ఆయన ఎక్కడా ఈ రకమైన దందాలు జరగకుండా స్వపక్షంతో పాటు విపక్షాన్ని కట్టడి చేశారు.
దాని ఫలితమే విశాఖ లోని లోకల్ పాలిటిక్స్ పార్టీలకు అతీతంగా ఒక్కటైంది అంటారు. విజయసాయిరెడ్డి మీద ఇంతదాకా నెల్లూరు రెడ్డి అంటూ టీడీపీ పెద్దలు విమర్శలు చేసేవారు, ఇక విజయసాయిరెడ్డి రాజకీయ పెత్తనం గిట్టని వారు స్వపక్షంలోనూ కొందరు ఉన్నారు. అంతా కలసి రెడ్డి గారి ప్రతిష్టను బదనాం చేస్తున్నారని తాజాగా గట్టిగా ప్రచారం సాగుతోంది.
హేయమైన పోస్టింగులను సోషల్ మీడియాలో పెట్టడం ద్వారా సాయిరెడ్డి ప్రతిష్ట దెబ్బ తీయడమే దీని వెనక టార్గెట్ అంటున్నారు. ఆ విధంగా జగన్ నుంచి సాయిరెడ్డిని వేరు చేస్తే ఆయన్ని విశాఖ నుంచి పంపించేస్తే తమ దందాల పని సులువు అనుకున్న వారే దారుణమైన పోస్టింగులు పెడుతున్నారని అంటున్నారు.
దీని మీద ఇపుడు పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. విశాఖలో భూదందాలు సాగకుండా జిల్లా యంత్రాంగం సైతం కట్టుదిట్టంగా పనిచేస్తోంది. దీని వెనక ప్రభుత్వం నుంచి కచ్చితమైన ఆదేశాలు ఉన్నాయి. దాంతో భూములను దిగమింగాలనుకుంటున్న వారికీ రియల్ దందాలు చేసేవారికి మింగుడుపడడంలేదన్న మాట ఉంది. మొత్తానికి చూసుకుంటే విజయసాయిరెడ్డి మీద రాజకీయ కుట్ర సాగుతోందని వైసీపీలో గట్టిగా వినిపిస్తోంది. మరి చూడాలి దీని ఫలితాలూ, పర్యవసానాలూ ఎలా ఉంటాయో.