కర్ణాటక ప్రభుత్వం నేటి నుంచి ఎస్ఎస్ఎల్సీ పరీక్షల నిర్వహణ మొదలుపెట్టింది. దాదాపు ఎనిమిది లక్షల మంది క్లాస్ టెన్త్ విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరవుతూ ఉన్నారు. ఈ మేరకు కర్ణాటక వ్యాప్తంగా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లనూ చేసింది. బెంగళూరు నగరంతో సహా రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరీక్షలను నిర్వహిస్తూ ఉన్నారు. సెంటర్ల వద్ద థర్మల్ స్క్రీనింగ్ ఏర్పాట్లు చేయడంతో పాటు, శానిటైజేషన్, మాస్క్ లను కూడా ప్రభుత్వం అందుబాటులో ఉంచింది. ప్రతి సెంటర్ లోనూ తక్కువమందితోనే ఈ పరీక్షలను నిర్వహిస్తూ ఉండవచ్చు.
వివిధ రాష్ట్రాల్లో కరోనా భయాల నేపథ్యంలో ప్రధాన పరీక్షలను కూడా వాయిదా వేయడం లేదా రద్దు చేయగా, కర్ణాటకలో మాత్రం ప్రభుత్వం ధైర్యంగా పరీక్షలను నిర్వహిస్తూ ఉండటం గమనార్హం. కర్ణాటకలోనూ దినవారీగా కేసుల సంఖ్య కొద్ది మేర పెరుగుతూ ఉన్నాయి. మహారాష్ట్ర నుంచి వచ్చిన వారి వల్ల కర్ణాటకలో కేసుల సంఖ్య పెరుగుతూ ఉంది. ఈ క్రమంలో కూడా ప్రభుత్వం పరీక్షల నిర్వహిస్తూ ఉండటం గమనార్హం.
ఏపీలో కూడా ఒక దశలో ప్రభుత్వం పరీక్షలను నిర్వహించడానికి రెడీ అయ్యింది. అయితే రాజకీయ విమర్శలు మొదలయ్యాయి. ఏపీలో ప్రభుత్వం ఏం చేసినా.. రాజకీయ విమర్శలు అధికంగా ఉంటాయి. భావోద్వేగాలను రెచ్చగొట్టి, ప్రభుత్వం ఎడ్డెం అంటే తెడ్డెం అనడం ద్వారా లబ్ధి పొందాలనుకునే వారు చాలా మంది తయారయ్యారు.
అందుకే ప్రభుత్వం కూడా తనదేం పోయిందన్నట్టుగా పరీక్షలను రద్దు చేసినట్టుగా ఉంది. రద్దు చేయడం వల్ల నష్టపోయేది అంతిమంగా విద్యార్థులే అని వేరే చెప్పనక్కర్లేదు. మంచి మార్కులతో మొమో అందుకోవాలనే కోరిక కొన్ని లక్షల మంది విద్యార్థులకు ఉంటుంది. అలా కాకుండా.. కరోనా కారణం చేత పరీక్షలు నిర్వహించకపోవడం వల్ల పాస్ అయ్యారని వచ్చే మెమో వారికి అంత గర్వకారణం ఏమీ కాదు. ఒకవేళ ఏపీ ప్రభుత్వమే పరీక్షలను నిర్వహించాలని నిర్ణయం తీసుకుని, అమలు చేసి ఉంటే.. దానిపై రచ్చ ఏ స్థాయిలో ఉండేదో! వీర ప్రతిపక్ష నేతలు దానిపై ఎంత రాద్ధాంతం చేసే వాళ్లో!