మెల్లగా ఈ జానర్ ను కూడా కామెడీ చేసేస్తున్నారుగా!

ఒకప్పుడు సీరియస్ కథాంశం అయిన ఫ్యాక్షనిజంను ఎంత కామెడీ చేయాలో అంతా చేశారు తెలుగు మేకర్స్. ఆ తర్వాత హారర్ ను కూడా కామెడీ చేసి పడేశారు. రీసెంట్ గా జాంబీలతో కూడా కామెడీ…

ఒకప్పుడు సీరియస్ కథాంశం అయిన ఫ్యాక్షనిజంను ఎంత కామెడీ చేయాలో అంతా చేశారు తెలుగు మేకర్స్. ఆ తర్వాత హారర్ ను కూడా కామెడీ చేసి పడేశారు. రీసెంట్ గా జాంబీలతో కూడా కామెడీ పండించిన ఘనత మన టాలీవుడ్ ది. ఇలా ప్రతి జానర్ ను కామెడీతో నింపేస్తున్న మేకర్స్.. చివరికి జేమ్స్ బాండ్ టైపు సినిమాకు కూడా కామెడీ టచప్ ఇచ్చారు. అదే రాజా విక్రమార్క.

ఒక్కసారి ఎనౌన్స్ మెంట్ రోజును గుర్తుచేసుకుందాం. “ఇది చాలా కొత్త తరహా సినిమా. ఇప్పటివరకు ఈ టైపు నెరేషన్ రాలేదు. సీరియస్ ఏజెంట్ ను డిఫరెంట్ గా చూపించబోతున్నాం.” రాజా విక్రమార్క ప్రాజెక్టును ఎనౌన్స్ చేసినప్పుడు మేకర్స్ చెప్పిన మాటలివి. దీంతో అంతా ఈ సినిమాను హాలీవుడ్ రేంజ్ లో ఊహించుకున్నారు. సిక్స్ ప్యాక్ బాడీ ఉన్న కార్తికేయ, యాక్షన్ ఇరగదీస్తాడని, ఫైట్స్ అరగదీస్తాడని అనుకున్నారు.

కట్ చేస్తే ఈరోజు రాజా విక్రమార్క టీజర్ రిలీజైంది. జేమ్స్ బాండ్ గా కనిపించాల్సిన హీరో కాస్తా కామెడీ బాండ్ గా కనిపించాడు. చిన్నప్పుడు కృష్ణగారిని, పెద్దయ్యాక టామ్ క్రూస్ ను చూసి ఆవేశపడ్డామంటూ హీరో చెప్పిన డైలాగ్ చూస్తేనే ఈ సినిమా జానర్ ను ఎలా కామెడీగా మార్చేశారో అర్థమౌతోంది.

ఈ జానర్ లో కామెడీ పండిస్తూ, ఇంతకుముందే ఏజెంట్ సాయిశ్రీనివాస్ ఆత్రేయ అనే సినిమా వచ్చింది. ఇప్పుడు అదే దారిలో విక్రమార్క కూడా నడుస్తున్నట్టున్నాడు. టీజర్ లో ఎన్ఐఏ ఆఫీసర్ గా కార్తికేయ లుక్ బాగుంది.