సోషల్ మీడియా యుగం ఇది. ఎవ్వరూ ఏదీ చెప్పనక్కర్లేదు. అందరి తరఫునా ఎవరో ఒకరు ఏదో ఒకటి ప్రచారం చేస్తూ ఉంటారక్కడ. ఈ విషయంలో పెద్ద పెద్ద వాళ్లను కూడా నెటిజన్లు వదలరు. వారి పేరుతో వీళ్లే ఏదో ఒకటి పోస్టు చేస్తారు. ప్రత్యేకించి సామాజిక ప్రముఖులు, వ్యాపారవేత్తలు, నలుగురిలో పేరున్న వారి పేరుతో రకరకాల ఫేక్ మెసేజ్ లను పాస్ చేయడం సోషల్ మీడియాలో రొటీన్ తతంగమే. ఇలాంటి వాటి వైపు ఓ లుక్కేస్తే చాలా కనిపిస్తాయి.
చాణుక్యుడి పేరుతో మొదలుపెడితే.. సుందర్ పిచాయ్ వరకూ.. వారెవరూ చెప్పని మాటలను, వారు చెప్పిన మాటలుగా ప్రచారం చేయడం ఇండియన్ సోషల్ మీడియాలో పరమ రొటీన్. మహాత్మాగాంధీ పేరుతో కూడా రకరకాల ఆయన చెప్పని సూక్తులను ప్రచారం తీసుకొచ్చారు. గాంధీ కాబట్టి చెప్పే ఉంటాడని కాస్తో కూస్తో తెలిసిన వారు కూడా అనుకోవాల్సినంత గందరగోళాన్ని సృష్టిస్తుంది సోషల్ మీడియా.
ఇక వ్యక్తిగతంగా క్లీన్ ఇమేజ్ ఉన్న వాళ్లను కూడా సోషల్ మీడియా వదలదు. వారి పేరుతో తమ జాడ్యాన్ని అంతా కొందరు నెటిజన్లు ప్రచారం చేస్తూ ఉంటారు. వాట్సాప్ యూనివర్సిటీ మేధావులకు ఇదే పని. ఎవడో చెత్త, అబద్ధాలు పోస్టు చేస్తాడు. మరెవడో దాన్ని షేర్ చేస్తూనే ఉంటాడు. ఈ క్రమంలో ప్రముఖ వ్యాపారవేత్త రతన్ టాటా పేరుతో ఒక పోస్టు కొన్నాళ్లుగా తెగ షేర్ అవుతోంది. కొందరు అర్ధ మేధావులు దాన్ని తెగ షేర్ చేస్తున్నారు. దాని సారాంశం ఏమిటంటే.. మద్యం అమ్మకాలకూ ఆధార్ కూ అనుసంధానం చేయాలట. సంక్షేమ పథకాలకూ ఆ అనుసంధానం చేయాలట.. అప్పులు అసలు కథ బయటకు వస్తుందట. ఇది రతన్ టాటా చెప్పాడట.
రతన్ టాటా ఇలా ఎందుకు చెప్పి ఉంటాడు, అసలు ఆయనకు అలాంటి సందర్భం ఏది వచ్చి ఉంటుంది? అని ఆలోచించేంత తీరిక కూడా జనాలకు లేదు. ఏదో కనిపించింది షేర్ చేసి పారేశారంతే. ముందుగా హిందీ, మధ్యలో ఇంగ్లిష్, ఆ పై తెలుగులో కూడా ఇదే పోస్టు అనువాదం కనిపించింది. తెలుగు నెటిజన్లలో కూడా వాట్సాప్ యూనివర్సిటీ మేధావులు దీన్ని తెగ షేర్ చేశారు. వీళ్ల రచ్చ ఎంత వరకూ వెళ్లిందంటే.. చివరకు ఈ అంశంపై టాటా స్పందించక తప్పలేదు.
తను అలాంటి స్టేట్ మెంట్ ఏదీ ఇవ్వలేదని ఆయన వివరణ ఇచ్చుకున్నారు పాపం! సోషల్ మీడియానా మజాకా! తప్పుడు ప్రచారాలకూ, నకిలీలకూ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా మారింది. తాము చెబితే షేర్ లు రావనుకునే వాళ్లు, పెద్ద వాళ్ల పేర్లను ఉటంకిచేస్తారు. వారు చెప్పని కొటేషన్లను వీళ్లు చెప్పి మరీ షేర్ చేస్తారు. షేర్లూ, లైకులు మానసికమైన అనారోగ్యంగా మారాయి చాలా మందికి. ఆ అనారోగ్యంతో వారు నానా రచ్చ చేస్తూ, కాస్త ఆలోచన పరులను వాట్సాప్ గ్రూపులకూ, ఫేస్ బుక్ కు కూడా పూర్తిగా దూరం చేస్తూ ఉన్నారు.