నవంబరు 11న ప్రధాని నరేంద్రమోడీ విశాఖపట్నంలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఆరోజున విశాఖలో అనేక కార్యక్రమాలకు హాజరవుతారు. ఇటీవలి కాలంలోనే భీమవరం అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమం తర్వాత.. విశాఖలో రైల్వేస్టేషన్ మరమ్మతు పనులకు శంకుస్థాపన చేయడానికని వస్తుండడం విశేషం.
ఏపీ మీద బిజెపి పెంచుతున్న ఫోకస్ కు ఇది నిదర్శనం అని కూడా అనుకోవచ్చు. ఈ నేపథ్యంలో.. విశాఖలో జరిగే ప్రధాని పర్యటన కార్యక్రమానికి, ఏపీలో ఎన్డీయే కు ఉన్న ఏకైక భాగస్వామ్య పార్టీ జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ఆహ్వానం ఉంటుందా? ఉండదా? అనే చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. నిజానికి జనసేన కార్యకర్తల్లో ఆ టెన్షన్ అప్పుడే మొదలైంది. పవన్ కల్యాణ్ లోనూ టెన్షన్ ఉండనే ఉంది.
తనకు ప్రధాని మోడీ చాలా చాలా క్లోజ్ అని పవన్ కల్యాణ్ బహిరంగ వేదికల మీద డప్పుకొట్టుకుంటూ ఉంటారు. అలాంటిది.. భీమవరంలో అల్లూరి విగ్రహాన్ని ఆవిష్కరించడానికి ప్రధాని వస్తే.. ఆ కార్యక్రమానికి మాజీ కేంద్రమంత్రి, సినీనటుడు చిరంజీవిని కూడా ప్రత్యేకంగా ఆహ్వానించారు గానీ.. పవన్ కల్యాణ్ ను పిలవలేదు.
తమ పార్టీ జనసేన ఎన్డీయేలో భాగస్వామి అని పవన్ చెప్పుకోవాల్సిందే తప్ప.. ఆ పార్టీ జాతీయ నాయకులు ఎన్నడూ కూడా.. ఒక భాగస్వామ్య పార్టీకి ఇచ్చే గౌరవం విలువ జనసేనాని పవన్ కు ఇవ్వనే ఇవ్వరు. కేవలం.. ఏపీలో ఆయన కట్టుతప్పి.. చంద్రబాబు పంచన చేరకుండా ఉండడానికి.. ‘మేమిద్దరం ఈసారి ఎన్నికల్లో కలిసే పోటీచేస్తాం’ అని ఒకే ఒక డైలాగు వేస్తుంటారు. అంతే తప్ప.. బిజెపి పరంగా పవన్ కు దక్కుతున్న గౌరవం సున్నా!
భీమవరం కార్యక్రమంతోనే ప్రజల్లో కాస్త పరువు పోయింది. ఇప్పుడు ప్రధాని విశాఖపట్నానికి వచ్చి ఆ కార్యక్రమానికి కూడా తనను ఆహ్వానించకపోతే.. ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళతాయనేది పవన్ కోటరీ ఆందోళన. బిజెపిని పవన్ కల్యాణ్ మాత్రమే పట్టుకుని వేళ్లాడుతున్నాడని, వారు ఆయనను అస్సలు ఖాతరు చేయడం లేదని అందరూ గ్రహించే అవకాశం ఉంది.
అది కూడా.. బిజెపిని బతిమాలి అయినా సరే.. తెలుగుదేశంతో కలిసి పొత్తులతో పోటీచేయించాలనే చంద్రబాబునాయుడు స్కెచ్ మేరకి, స్క్రిప్ట్ మేరకి పవన్ కల్యాణ్ డ్రామా అని అనుకుంటున్న వారు కూడా లేకపోలేదు. మొత్తానికి ప్రధాని కార్యక్రమానికి జనసేనాని పవన్ ను పిలుస్తారో లేదో ఆ పార్టీ కార్యకర్తలు ఇప్పటినుంచే తెగ మధనపడిపోతున్నారు.