జగన్.. తగాదాల తీర్పులకు పూనుకోవాల్సిందే!

తప్పు ఎవరిదో తర్వాత తేల్చవచ్చు. కానీ, అంతర్గతంగా పొడసూపే తగాదాలు  తీర్చడానికి ముఖ్యమంత్రి, పార్టీ అధినేత స్వయంగా పూనుకోనంత వరకు అవి సెట్ కావు. అధికారంలో ఏ పార్టీ ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఆ పార్టీలోని…

తప్పు ఎవరిదో తర్వాత తేల్చవచ్చు. కానీ, అంతర్గతంగా పొడసూపే తగాదాలు  తీర్చడానికి ముఖ్యమంత్రి, పార్టీ అధినేత స్వయంగా పూనుకోనంత వరకు అవి సెట్ కావు. అధికారంలో ఏ పార్టీ ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఆ పార్టీలోని గ్రూపులు, ముఠాల మధ్య ఆధిపత్య రాజకీయాలు నడుస్తూనే ఉంటాయి. పార్టీలో తమదే పై చేయి అని చాటుకోవడానికి నిరూపించుకోవడానికి.. ఊర్లలో వివిధ గ్రూపుల నాయకులు తప్పకుండా ప్రయత్నిస్తూనే ఉంటారు. 

అయితే అలాంటి గ్రూపుల తగాదాలను ఎప్పటికప్పుడు సరిదిద్దుతూ.. వారిని సమన్వయం చేసుకుంటూ ప్రజల దృష్టిలో పలచన కాకుండా, పార్టీని ఐక్యంగా ముందుకు తీసుకువెళ్లడం మాత్రమే ప్రభుత్వానికి ఎప్పటికైనా శ్రీరామరక్ష. అలాకాకుండా గ్రూపు తగాదాలను ప్రోత్సహించినా, విస్మరించినా కూడా పార్టీకి చేటు తప్పదు. ఈ సంగతిని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అత్యంత కీలకంగా గుర్తించాలి. 

నియోజకవర్గాలలో పార్టీ అంతర్గత కుమ్ములాటల వ్యవహారాలు మితిమీరుతున్నప్పుడు వాటిని సెకండ్ గ్రేడ్ నాయకుల చేతిలో పెట్టడం.. తాను నిమ్మళంగా ఇతర ప్రభుత్వ వ్యవహారాలు చూసుకోవడం అనేది ఎప్పటికీ పాడి కాదు. పార్టీ బలంగా ఉంటేనే ప్రభుత్వం బలంగా ఉన్నట్టు లెక్క. పార్టీ ముఠా కుమ్ములాటలతో ఊరేగుతూ ఉంటే.. ప్రజల దృష్టిలో పలుచన అయిపోతూ ఉంటే.. ప్రభుత్వం మాత్రం బలోపేతం అవుతూ మరింత సుస్థిరంగా మనగలదని అనుకోవడం భ్రమ. తాజాగా తన దృష్టికి వచ్చిన నగరి నియోజకవర్గపు ముఠాకుమ్ములాటల గురించి జగన్ స్వయంగా స్పందించి వ్యవహారాలను సెట్ చేయాల్సిన అవసరం పార్టీకి ఉంది.

చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం నుంచి మరోసారి రోజాకు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశమే లభించకపోవచ్చు అనే ప్రచారం ఒకవైపు వినిపిస్తూనే ఉంది. ఇది ఆమె ప్రత్యర్ధులు సాగిస్తున్న ప్రచారం కూడా కావచ్చు. మరోవైపు నియోజకవర్గంలో గ్రూపు తగాదాలు ఆమెకు చికాకు తెప్పిస్తున్నాయి. ఇతర పార్టీలకు చెందిన రాజకీయ ప్రత్యర్థుల మీద విరుచుకుపడడంలో రోజా ఎంత దురుసుగా వ్యవహరిస్తారో.. సొంత పార్టీలోని నేతల పట్ల కూడా అదే తీరులో ఉంటారని కీర్తి ఆమెకు ఉంది. 

అందుకే ఆమె సొంత నియోజకవర్గంలో ముఠాలు ఏర్పడ్డాయి. ఆ ముఠాలను అదే జిల్లాకు చెందిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చాలా సహజంగా పెంచి పోషించారు. ఏతావతా నగరి వైసిపి అంతర్గత కుమ్ములాటలు అనేవి ఇవాళ బజార్న పడ్డాయి. నా నియోజకవర్గంలో నా మాటకు విలువ లేకుండా పోతోంది.. నన్ను బలహీనపరచాలని చూస్తున్నారు.. లాంటి అనేక రకమైన దీనాలాపనలతో రోజా విడుదల చేసిన ఆడియో క్లిప్ సర్వత్రా చర్చనీయాంశం అయింది. ఇప్పుడు అదే ముఠాతదాల గురించి రోజా నేరుగా సీఎం జగన్ నివాసానికి వచ్చి ఆయనకే గోడు వెళ్లబోసుకున్నారు.

ఇప్పుడు పార్టీ తగాదాలను చక్కదిద్దే బాధ్యత కూడా జగన్ మీదనే ఉంది. ముందే చెప్పుకున్నట్టు అధికారంలో ఉన్న పార్టీ గనుక కార్యకర్తలకు ఆశలు ఎక్కువగా ఉండటం తదనుగుణంగా గ్రూపులు పెరగడం గ్రూపుల మధ్య తగాదాలు ఏర్పడడం సహజం. నియోజకవర్గాలలో గ్రూపు తగాదాలు శృతిమించుతున్నప్పుడు.. పార్టీ అధినాయకత్వం వాటి గురించి దృష్టి సారించాల్సిన అగత్యం ఏర్పడితే ఇప్పటిదాకా జగన్ స్వయంగా చొరవ తీసుకున్న సందర్భాలు బహు తక్కువ. వాటిని సాధారణంగా ఆయన సజ్జల రామకృష్ణారెడ్డి చేతుల్లో పెట్టి తాను చేతులు దులిపేసుకుంటారు. 

కానీ వైయస్సార్ కాంగ్రెస్ అనేది తన సొంత పార్టీ అయినప్పుడు అందులో ముఠా తగాదాల వలన ఏ నష్టమైనా జరిగితే అది తనకు వ్యక్తిగత నష్టం అవుతుందనే సంగతి జగన్ గ్రహించాలి. ఇలాంటి ప్రతి తగాదా మీద స్వయంగా తానే చర్య తీసుకోవాలని ఆయన తెలుసుకోవాలి. ఆయన తర్వాతి స్థాయి నాయకులు సమస్యల పరిష్కారానికి పూనుకుంటుండడం వలన.. ఆ గొడవలు తాత్కాలికంగా మాత్రమే సద్దుమణుగుతున్నా యి. దీనివలన ఎన్నికలు వచ్చే సమయానికి పార్టీకి నష్టం తప్పదనే భయం అనేకమంది అభిమానుల్లో ఉంది. 

నియోజకవర్గంలో తనకు ఎదురవుతున్న ముఠాల ఇబ్బందుల గురించి నేరుగా సీఎం జగన్ తో నివేదించగల అవకాశం కూడా చాలామంది ఎమ్మెల్యేలకు దక్కదు. రోజా స్థాయి పరంగా గాని, మంత్రి అనే హోదా పరంగా గాని.. ఆ అవకాశం దక్కించుకున్నారు. జగన్ స్వయంగా ఇలాంటి తగాదా లను పరిష్కరించడానికి రంగంలోకి దిగాలి. ఆయన చొరవ మాత్రమే పార్టీని కాపాడుతుంది. లేని సందర్భంలో ఆయనకే పార్టీ పట్ల అశ్రద్ధ, నిర్లక్ష్యం అనే ప్రచారం పార్టీ లోలోన మొదలైనా ఆశ్చర్యం లేదు!