రాజకీయాల్లో ఎప్పటికప్పుడు ఎత్తులు, పైఎత్తులు వేస్తూ వుండాలి. లేదంటే ప్రత్యర్థుల కంటే వెనుకబడి పోవడం ఖాయం. ఈ విషయంలో అధికార పార్టీ వైసీపీ ఎంతో అప్రమత్తంగా ఉన్నట్టు కనిపిస్తోంది. 2024 ఎన్నికల నేపథ్యంలో ఏపీ రాజకీయ సమీకరణలు మారనున్నాయి. టీడీపీ, జనసేన మధ్య దాదాపు పొత్తు ఖాయమైనట్టే. ఇటీవల చంద్రబాబు, పవన్‌కల్యాణ్ భేటీ అనంతరం క్షేత్రస్థాయిలో టీడీపీ, జనసేన నేతలు కలిసి ప్రజాపోరాటాల్లో పాల్గొంటున్నారు. ఆ రెండు పార్టీల కలయికతో జరిగే నష్టాన్ని నివారించేందుకు వైసీపీ కొత్త వ్యూహాలను రచిస్తోంది.
పవన్‌కల్యాణ్ మద్దతుతో టీడీపీకి మెజార్టీ కాపు, బలిజ ఓట్లు వెళ్లే అవకాశం ఉందని వైసీపీ అంచనా వేస్తోంది. అయితే ఆ సామాజిక వర్గాన్ని వ్యతిరేకించే ఇతర కులాల ఓట్లను తమ వైపు తిప్పుకునేందుకు వైసీపీ కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా జనాభాలో సగం ఓట్లున్న బీసీలపై వైసీపీ దృష్టి పెట్టింది. బీసీలు మొదటి నుంచి టీడీపీకి గట్టి మద్దతుగా నిలుస్తూ వస్తున్నారు. అయితే గత సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం టీడీపీ బీసీల ఓట్లకు వైసీపీ గండి కొట్టింది.
ఈ దఫా జనసేన, టీడీపీ కలయిక నేపథ్యంలో బీసీల ఓట్లను మరింత ఎక్కువగా తమ వైపు తిప్పుకునేందుకు వైసీపీ పకడ్బందీ వ్యూహం రచిస్తోంది. ఇప్పటికే అధికార పంపిణీలో బీసీలు, మహిళలు, మైనార్టీలు, దళితులకు జగన్ ప్రభుత్వం పెద్దపీట వేసింది. రానున్న రోజుల్లో మరింతగా ప్రాధాన్యం ఇస్తానని చెబుతూ, వారి ఓట్లను రాబట్టుకునేందుకు వైసీపీ ముందుకెళుతోంది. ఇందులో భాగంగా మొదటి అడుగుగా తాడేపల్లిలో బీసీల ఆత్మీయ సదస్సును అధికార పార్టీ నిర్వహించింది.
మరో పది రోజుల్లో రాష్ట్ర సదస్సును నిర్వహించతలపెట్టినట్టు రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తెలిపారు. బీసీల్లోని అన్ని కులాలను ఒకే తాటిపైకి తేవడానికి వైసీపీ పథక రచన చేస్తోంది. రానున్న రోజుల్లో 26 జిల్లాల్లోనూ బీసీ సదస్సులు నిర్వహించేందుకు వైసీపీ ప్లాన్ చేస్తోంది.
బీసీలకు కేవలం మాటలు చెప్పడం కాకుండా, స్థానిక సంస్థల పదవులు, నామినేటెడ్, కార్పొరేషన్ పదవుల్లో బీసీలకు అత్యధిక శాతం పదవులు ఇవ్వడాన్ని చూపి, వారికి పార్టీపై నమ్మకం కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. పవన్‌తో కలిసిన టీడీపీకి బీసీల ఓట్లను దూరం చేసేందుకు ఇదే సరైన సమయంగా వైసీపీ దూకుడు ప్రదర్శిస్తోంది.