బ‌రిలో జ‌గ‌న్ మేన‌మామా? బామ్మ‌ర్దా?

ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో అభ్య‌ర్థులెవ‌ర‌నే విష‌య‌మై ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలో తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైంది. వైఎస్సార్ జిల్లా క‌మ‌లాపురం వైసీపీ అభ్య‌ర్థి ఎవ‌రో ఇంకా ఖ‌రారు కాలేదు. ప్ర‌స్తుతం ఇక్క‌డి నుంచి సీఎం వైఎస్ జ‌గ‌న్ మేన‌మామ…

ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో అభ్య‌ర్థులెవ‌ర‌నే విష‌య‌మై ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలో తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైంది. వైఎస్సార్ జిల్లా క‌మ‌లాపురం వైసీపీ అభ్య‌ర్థి ఎవ‌రో ఇంకా ఖ‌రారు కాలేదు. ప్ర‌స్తుతం ఇక్క‌డి నుంచి సీఎం వైఎస్ జ‌గ‌న్ మేన‌మామ పి.ర‌వీంద్ర‌నాథ్ రెడ్డి ప్రాతినిథ్యం వ‌హిస్తున్నారు. వ‌రుస‌గా రెండో సారి ఆయ‌న గెలుపొందిన సంగ‌తి తెలిసిందే. ముచ్చ‌ట‌గా మూడో సారి ఆయ‌న బ‌రిలో నిలిచి హ్యాట్రిక్ సాధిస్తారా? లేక కుమారుడైన న‌రేన్ రామాంజ‌నేయ‌రెడ్డిని నిలుపుతారా? అనేది స్ప‌ష్ట‌త రాలేదు.

కుమారుడిని పోటీలో నిలిపి, తాను వ్యాపారాల‌పై దృష్టి సారించాల‌ని ర‌వీంద్రనాథ్‌రెడ్డి అనుకుంటున్నార‌ని తెలిసింది. అయితే ఆయ‌న‌కు జాత‌కాలపై న‌మ్మ‌కం ఎక్కువ అని చెబుతున్నారు. ఎన్నిక‌ల తేదీని బ‌ట్టి బ‌రిలో ఎవ‌రుంటే అదృష్టం క‌లిసొస్తుందో ఆ రోజు ప‌రిస్థితిని బ‌ట్టి జాత‌కం చూసుకుని నిర్ణ‌యించుకోవాల‌నే త‌లంపులో ర‌వీంద్ర‌నాథ్‌రెడ్డి ఉన్న‌ట్టు స‌మాచారం. అందుకే ఆయ‌న గ‌డ‌ప‌గ‌డ‌ప‌లో త‌న‌కు ఓటు వేయాల‌ని ఏ ఒక్క ఓట‌రును అడిగిన పాపాన పోలేదు.

కేవ‌లం ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ పేరు ప్ర‌స్తావిస్తూ, మ‌రోసారి ఆయ‌న్ను ఆశీర్వ‌దించాల‌ని, ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాల‌ని మాత్ర‌మే ర‌వీంద్ర‌నాథ్‌రెడ్డి కోరుతుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రోవైపు తాను పోటీ చేస్తే విజ‌యావ‌కాశాలు ఎలా వుంటాయ‌ని ర‌వీంద్ర‌నాథ్‌రెడ్డి కుమారుడు, జ‌గ‌న్‌కు వ‌రుస‌కు బామ్మ‌ర్ది అయ్యే న‌రేన్ ఆరా తీస్తున్నారు. తండ్రితో పాటు న‌రేన్ కూడా క‌మ‌లా పురం నియోజ‌క‌వ‌ర్గంలో పర్య‌టిస్తున్నారు. ప్ర‌స్తుతం ఇత‌ను చింత‌కొమ్మ‌దిన్నె జెడ్పీటీసీ స‌భ్యుడు.

వైసీపీ ఎమ్మెల్యేల్లో చాలా మంది ఈ ద‌ఫా త‌మ పిల్ల‌ల్ని చ‌ట్ట‌స‌భ‌ల‌కు పంపే ఆలోచ‌న‌లో ఉన్నారు. వారిలో జ‌గ‌న్ ఎంత మందికి గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తారో తెలియ‌దు. జ‌గ‌న్‌కు అత్యంత స‌మీప బంధువైన ర‌వీంద్ర‌నాథ్‌రెడ్డి కోరుకుంటే త‌న కుమారుడికి టికెట్ ఇప్పించుకోవ‌డం పెద్ద ప‌ని కాద‌నే టాక్ వినిపిస్తోంది. అయితే జ‌గ‌న్ ప్ర‌భుత్వం వ‌చ్చిన త‌ర్వాత కూడా ర‌వీంద్ర‌నాథ్‌రెడ్డి నియోజ‌క‌వ‌ర్గాన్ని, సొంత పార్టీ నాయ‌క‌త్వాన్ని ప‌ట్టించుకోలేద‌నే అసంతృప్తి వుంది. ఈ నేప‌థ్యంలో ఎన్నిక‌ల్లో ఆ ప్ర‌భావం వుంటుంద‌నే చ‌ర్చ న‌డుస్తోంది.