వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు టీడీపీ ఇన్‌చార్జ్ జీ.ప్రవీణ్‌కుమార్‌రెడ్డికి అప్పుడే భయం పట్టుకుంది. మాజీ ఎమ్మెల్యేలు వరదరాజులరెడ్డి, లింగారెడ్డితో పాటు సీఎం సురేష్‌నాయుడు తదితరులు ప్రొద్దుటూరు టికెట్ ఆశిస్తున్నారు. 2019లో టికెట్ దక్కకపోవడం వరదరాజులరెడ్డి మూడేళ్ల పాటు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఏడాదిగా ఆయన యాక్టీవ్ అయ్యారు. ఎందుకనో లింగారెడ్డిపై టీడీపీ అధిష్టానానికి సదభిప్రాయం లేదు.
దీంతో ఆయన్ను కడప జిల్లా టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా నియమించి, ప్రొద్దుటూరు తెరపై నుంచి పక్కకు తప్పించింది. కడప జిల్లాకు ఉక్కు పరిశ్రమ కావాలంటూ ఉద్యమం నడిపిన ప్రవీణ్‌ను టీడీపీలో చేర్చుకున్నారు. ఆ తర్వాత ఆయన్నే ప్రొద్దుటూరు ఇన్‌చార్జ్‌గా నియమించారు. ఇటీవల లోకేశ్ ప్రొద్దుటూరులో నిర్వహించిన పాదయాత్ర సభలో ఉక్కు ప్రవీణ్‌కే టికెట్ అని పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు. అయినప్పటికీ టీడీపీ సీనియర్ నాయకులు టికెట్ కోసం ప్రయత్నాలను విరమించలేదు.
దీన్ని ప్రవీణ్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఇటీవల సీఎం సురేష్‌నాయుడు ప్రొద్దుటూరులో అన్నా క్యాంటీన్‌ను ప్రారంభించారు. ఆ సభలో ఉక్కు ప్రవీణ్ మొహం చూపించి, కనీసం వేదిక ఎక్కకుండానే వెళ్లిపోవడం టీడీపీ నేతల్ని ఆశ్చర్యానికి గురి చేసింది. వరదరాజులరెడ్డి, లింగారెడ్డి, సురేష్‌నాయుడులతో సంబంధం లేకుండానే ఉక్కు ప్రవీణ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీంతో ప్రొద్దుటూరు నియోజకవర్గంలో టీడీపీ నాలుగు వర్గాలుగా విడిపోయింది. ప్రవీణ్ ఒక్కడే ఒక వైపు, మిగిలిన వాళ్లంతా మరో వైపు అన్నట్టుగా తయారైంది.
తాజాగా రాజుపాలెం మండలంలో వార్డు ఉప ఎన్నికలో టీడీపీ మద్దతుదారు గెలుపొందారు. ఈ విజయంలో నాయకులందరినీ భాగస్వామ్యం చేసే ఉద్దేశం ప్రవీణ్‌లో కొరవడడంపై మిగిలిన నేతలు ఆగ్రహంగా ఉన్నారు. ఇంకా అధికారికంగా టికెట్ ఖరారు కాలేదని ప్రవీణ్ గుర్తించుకోవాలని, ఒంటరిగా వెళుతూ పార్టీ మరోసారి ఓడిపోవడానికి కారణం కావాలని ఆయన అనుకుంటున్నారా? అని సీనియర్ నేతలు ప్రశ్నిస్తున్నారు.
ఇన్‌చార్జ్ పదవికే అంత గర్వమైతే, ఇక అభ్యర్థిగా ప్రకటిస్తే పరిస్థితి ఏంటని సీనియర్ నేతలు నిలదీస్తున్నారు. ప్రొద్దుటూరులో ప్రభుత్వ వ్యతిరేకతను సొమ్ము చేసుకునే వాతావరణం ఉన్నప్పటికీ, ప్రవీణ్ ఒంటెత్తు పోకడలు నష్టం తెస్తున్నాయనే ఆవేదన టీడీపీ సీనియర్ నేతల్లో వుంది.