కంటెంట్‌లో విషయం లేనప్పుడు ప్రజెంటేషన్లో ఏదో ఒక మాయ చేయాలి! ఎలాగైనాసరే ప్రేక్షకులను థియేటర్ దాకా రప్పించాలి.. టికెట్లు అమ్మాలి.. మనం బతకాలి! నూటికి నూరు శాతం సినిమా వాడైన హీరో పవన్ కళ్యాణ్ కు ఈ ప్రాథమిక సూత్రం తెలియని సంగతి ఎంత మాత్రం కాదు. ఆయన ఇదే సూత్రాన్ని రాజకీయాలకు కూడా వర్తింపజేసే లబ్ధి పొందాలని అనుకుంటున్నారు.
తాను క్రియాశీలంగా ఉన్నట్టుగా ప్రజల ఎదుట బిల్డప్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. ఆయన పాట్లేవో ఆయన పడతారు గాని.. అధికారంలో ఉన్న మంత్రులకు ఆయన ప్రశ్నలను సంధించే క్రమంలో ముగ్గురు మంత్రులను మాత్రం చులకనగా చూడడం గమనార్హం.
రాజకీయంగా ప్రస్తుతం తాను యాక్టివ్ గా లేడు కనుక.. ట్విట్టర్లో యాక్టివిటీ చూపిస్తున్నారు పవన్ కళ్యాణ్. ప్రశ్నించడం తప్ప తనకు వేరే పనేమీ లేదని, తాను సాధించేది కూడా ఏమీ లేదని.. సదా చెబుతూ ఉండే పవన్ కళ్యాణ్, తాజాగా ట్విటర్ ద్వారా ఏడుగురు మంత్రులకు ప్రశ్నలను సంధించారు. ముందే చెప్పుకున్నట్టుగా అవేమీ కొత్త ప్రశ్నలు కాదు. మైకు దొరికితే చాలు ప్రభుత్వాన్ని నిందించడానికి ఆయన రొటీన్‌గా వాడుతున్న మాటలే. కాకపోతే ఈసారి వాటిని ఫోటోషాప్‌లో డిజైన్ చేయించి సదరు మంత్రుల ఫోటోలు బ్లాక్ అండ్ వైట్ లోను.. తన ఫోటోలు మల్టీ కలర్ లోను.. పెట్టుకుని విడుదల చేశారు పవన్ కళ్యాణ్.
ఏదో ప్రజల్లో ఉన్నట్టుగా కనిపించడానికి ఆయన తంటాలు ఆయన పడుతున్నారని అనుకోవచ్చు. అయితే ఈ డిజైన్ల విషయంలో ప్రజలకు కొన్ని సందేహాలు కలుగుతున్నాయి. బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, రోజా, విడదల రజని, దాడిశెట్టి రాజా, గుడివాడ అమర్నాథ్, జోగి రమేష్ లకు పవన్ ప్రశ్నలు సంధించారు. వీరి కోసం చేసిన ఫోటోషాప్ డిజైన్లలో తొలి నలుగురికి చూపుడు వేలు చూపిస్తూ బెదిరిస్తున్నట్టుగా పవన్ ఫోటో, తతిమ్మా ముగ్గురికి చెప్పు చూపించి బెదిరిస్తున్నట్టుగా పవన్ ఫోటో పెట్టారు. ఈ తేడా ఎందుకు వచ్చింది అనేదే ప్రజలకు కలుగుతున్న సందేహం.
ఆయన చెప్పు చూపిస్తున్నట్టుగా బెదిరిస్తున్న మంత్రులు బీసీ, కాపు కులాలకు చెందినవారు. చూపుడు వేలు చూపిస్తున్న వారిలో అగ్రవర్ణాల వారు కూడా ఉన్నారు. ఈ తేడా పవన్ కళ్యాణ్ ట్విట్టర్ డిజైన్ ల మీద ప్రభావం చూపించిందా అని అనుమానం ఇప్పుడు ప్రజలకు కలుగుతుంది. అగ్రకులాలకు చెందిన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, తనకంటూ సొంత బలము బలగము కలిగి ఉన్న బొత్స సత్యనారాయణ, తేడా వస్తే మాటలతోనే చర్మం వలిచి ఆరేసే రోజా.. విషయంలో పవన్ కళ్యాణ్ ఫోటో చూపుడు వేలెత్తి బెదిరిస్తున్నట్టుగానే ఉంది. జోగి రమేష్, గుడివాడ అమర్నాథ్, దాటిశెట్టి రాజాలకు మాత్రం చెప్పు చూపిస్తున్నారు. పవన్ వ్యవహార సరళిలో ఈ తేడా ఎందుకు వచ్చింది? ‘అగ్రకులాల, జన బలం గల నాయకులకు చెప్పు చూపించే’ దమ్ము ఆయనకు లేదా? ‘ఇతరులకు కూడా చెప్పు చూపించరాదు’ అనే సంస్కారం ఆయనకు లేదా? అనే అనుమానం పలువురికి కలుగుతోంది.
ప్రశ్నల రూపంలో పవన్ తన అజ్ఞానాన్ని బయట పెట్టుకోవడం సరే సరి. ‘రాష్ట్రం అప్పులు చేస్తే ప్రజలలో ఒక్కొక్కరి మీద ఎంత అప్పులు చేశారు’ అని నిలదీయడం కామెడీకి మాత్రమే పనికి వస్తుంది. గొప్పగా ఉన్న ఇళ్లు ఎన్ని కట్టించావు అని అడగడం ద్వారా ఇల్లు కట్టించడం అనేది సవ్యంగానే జరుగుతున్నట్టు కూడా అర్థమవుతుంది. పాఠశాలలకు మౌలిక వసతులు ఎప్పుడు వస్తాయి అని అడగడం ఇంకా చిత్రమైన సంగతి.
నాడు నేడు ద్వారా అనేక పాఠశాలలో రూపురేఖలు సమూలంగా మారుతూ ఉన్న నేపథ్యంలో దశల వారీగా జరుగుతున్న పనుల గురించి ఇలాంటి ప్రశ్న వేయడం పవన్ అజ్ఞానానికి నిదర్శనం. మొత్తానికి వరుస ట్వీట్ల ద్వారా ప్రజలు తనను చూసి మరోసారి నవ్వుకోవడానికి అవకాశం కల్పించారు పవన్ కళ్యాణ్.