ఈఎస్ఐ మందుల కొనుగోలులో అవకతవకలపై అరెస్ట్ అయిన మాజీ మంత్రి అచ్చెన్నాయుడు పైల్స్‌తో బాధ పడుతూ గుంటూరు జనరల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. అయితే సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో చికిత్సకు అనుమతించాలని అచ్చెన్నాయుడు చేసుకున్న అభ్యర్థను న్యాయస్థానం తిరస్కరించింది. దీంతో ఆయనకు గుంటూరు జనరల్ ఆస్పత్రిలోనే ట్రీట్మెంట్ కొనసాగనుంది.
ఇప్పటికే పైల్స్‌కు గుంటూరు జనరల్ ఆస్పత్రిలో మరోమారు ఆపరేషన్ చేసిన విషయం తెలిసిందే. రక్తస్రావం కాకుండా వైద్యులు మెరుగైన వైద్యం అందించారు. ఈ నేపథ్యంలో ఆయనకు సూపర్ స్పెషాలిటీ వైద్యం అవసరం లేదని న్యాయస్థానం నిర్ణయించింది.
ఇదే సమయంలో అచ్చెన్నాయుడును మూడురోజుల ఏసీబీ కస్టడీకి ఇస్తూ విజయవాడ న్యాయస్థానం బుధవారం ఉత్తర్వులిచ్చింది. ఈ నెల 25 నుంచి 27వ తేదీ వరకు ఏసీబీ విచారించనుంది. అచ్చెన్నతో పాటు ఈ కేసులో నిందితులైన ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ (ఐఎంస్) మాజీ డైరెక్టర్ రమేశ్ కుమార్‌నూ మూడు రోజుల కస్టడీకి ఇస్తూ ఉత్తర్వులిచ్చారు.
ఔషధాల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణతో నమోదైన మరో కేసులో నిందితులు డాక్టర్ విజయ్‌కుమార్, డాక్టర్ వి.జనార్దన్, ఎంకేపీ చక్రవర్తి, గోనె వెంకటసుబ్బారావులను రెండు రోజుల కస్టడీకి అనుమతిచ్చారు. దీంతో ఈ కేసులో పురోగతి కనిపిస్తోంది.