ఇంత కాలం టాలీవుడ్ ఓ మంచి రచయితని, నటుడిని కనిపెట్టలేకపోయింది. ఇప్పుడిప్పుడే ఆ రచయిత, నటుడి అద్భుత కళా నైపుణ్యం బయటపడుతోంది. కేంద్రహోంశాఖకు ఐదు పేజీల లేఖ రాయడంతో ఆ మహా రచయిత, నట చక్రవర్తి రాష్ట్ర ఎన్నికల మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ ప్రతిభ వెలుగు చూసింది.
తాజాగా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు రాసిన లేఖతో నిమ్మగడ్డలోని హాస్యం, సెంటిమెంట్‌తో కూడిన రచయిత బయటపడ్డాడు. అలాగే ఆయనలోని కరుణ రసం కూడా బాగా పండింది. కీలక సమయంలో దేవత లాంటి అమ్మను కూడా రచ్చకెక్కిస్తూ…సెంటిమెంట్‌ను పండించడంలో నిమ్మగడ్డ ఘనుడే అని తెలిసొచ్చింది. గవర్నర్‌కు నిమ్మగడ్డ రాసిన లేఖ సారాంశం ఏంటో పరిశీలిద్దాం.
‘అనారోగ్యంతో విజయవాడలో చికిత్స పొందుతున్న 84 ఏళ్ల నా తల్లిని చూసేందుకూ వెళ్లలేని పరిస్థితిలో ఉన్నా. హైదరాబాద్‌లోని నా ఇంటిపై 24 గంటలూ నిఘా పెట్టారు. వారు నియమించిన మనుషులు ఒక కారు, రెండు మోటార్ సైకిళ్లపై నన్ను నిరంతరం నీడలా వెంటాడారు. నా ఫోన్లనూ ట్యాప్ చేశారని భావిస్తున్నా. ఈ విషయంలో మీరు తక్షణం జోక్యం చేసుకోవాలి’
హైదరాబాద్‌లో పార్క్‌హయత్ హోటల్‌లో బీజేపీ నేతలకు కలవడానికి నిమ్మగడ్డకు ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ విజయ వాడలో కన్న తల్లిని పరామర్శించేందుకు మాత్రం ఈయనకు ఇబ్బందులట. సుజనాచౌదరి, కామినేని శ్రీనివాస్‌ను కలవడానికి గవర్నర్ అనుమతి కోరాడా? గవర్నర్ అనుమతితోనే కేంద్రానికి లేఖ రాశాడా? ఏమీ లేదే? మరెందుకు ఇప్పుడు అనారోగ్యంతో తల్లిని చూడడానికి మాత్రం గవర్నర్ అనుమతి కోరడం?
మరెందుకు ఈ సెంటిమెంట్ రాతలు? ఈ దొంగ ఏడ్పు ఎవరి కోసం? ఎందుకోసం? చివరికి స్వార్థ ప్రయోజనాల కోసం కన్న తల్లిని రచ్చకీడ్చడానికి కూడా నిమ్మగడ్డ వెనుకాడలేదంటే…ఇక ఆయన గురించి ఏం చెప్పాలి? నిమ్మగడ్డలో మంచి రచయితే కాదు…అద్భుత నటుడు కూడా ఉన్నాడనేందుకు ఆయన వ్యవహార శైలే నిదర్శనం.
‘నాకు వ్యతిరేకంగా పెద్ద కుట్ర జరుగుతోందని తెలియడంతో, భద్రత కోసం తెలంగాణ ప్రభుత్వాన్ని సంప్రదించా. నేను విజయవా డకు, ఎన్నికల సంఘం కార్యాలయంలోకి వెళ్లకుండా అడ్డుకునేందుకు పెద్ద సంఖ్యలో పోలీసుల్ని మోహరించారు’
మరీ ఈ మాటలు హాస్యంగా లేవా నిమ్మగడ్డ గారూ. పార్క్ హయత్‌లో ఎవరికి వ్యతిరేకంగా కుట్రలు చేశారో కాస్తా చెప్పరా? భద్రత కోసం తెలంగాణ ప్రభుత్వాన్ని సంప్రదించానంటున్నారు కదా…మరి ఇప్పుడు విజయవాడ వెళ్లేందుకు కూడా వారినే సంప్రదించకపోయారా? ఏ హోదాలో ఎన్నికల సంఘం కార్యాలయానికి వెళ్లాలనుకుంటున్నారో ముందు చెప్పండి నిమ్మగడ్డ. స్వీయ నియామకం ఎక్కడైనా చెల్లుతుందా? సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుండగా ఎందుకింత తొందర? అసలు ఇప్పట్లో ఎన్నికలే లేనప్పుడే ఎలాంటి రాచకార్యాలయాలు వెలగబెట్టాలని తహతహలాడుతున్నారు?
ఎన్నికల సంఘం స్వతంత్రత, సమగ్రత గురించి…మీరు తప్ప, మరెవరైనా మాట్లాడితే గౌరవంగా ఉంటుందేమో. ఎందుకంటే ఇటీవల నిమ్మగడ్డ వ్యవహార శైలి ఏ స్థాయిలో విమర్శల పాలైందో అందరికీ తెలుసు. తాజాగా హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్, గవర్నర్‌కు లేఖ రాయడం…తాజాగా పార్క్ హయత్ వ్యవహారంపై జరుగుతున్న చర్చను దారి మళ్లించడం కోసమే అనే వాదన లేకపోలేదు.