మెగాస్టార్ వాల్తేర్ వీరయ్య… బాలయ్య వీరసింహా రెడ్డి.. ఈ రెండు సినిమాలు సంక్రాంతికి విడుదల కాబోతున్నాయి. ఒకే సంస్థ నిర్మించిన రెండు భారీ సినిమాలు ఒక్క రోజు తేడాతో విడుదల కావడం అన్నది టాలీవుడ్ లో ఇదే తొలిసారి కావచ్చు. కానీ దీని వెనుక ఏం జరిగింది. రకరకాల వార్తలు వున్నాయి. కానీ యూనిట్ కు దగ్గరగా వున్న ఇన్ సైడ్ వర్గాల కథనం ఇలా వుంది.
బాలయ్య అండ్ గోపీచంద్ మలినేని సినిమా యూనిట్ టర్కీ వెళ్లే వరకు సినిమా విడుదల డిసెంబర్ అనే వుంది. కానీ మరి ఎవరు చెప్పారో? ఏం జోస్యం చెప్పారో బాలయ్య వున్నట్లుండి సంక్రాంతి విడుదల అన్నారు. అంతే మైత్రీ మూవీ మేకర్స్ నెత్తిన రాయి పడింది. అర్జంట్ గా బయల్దేరి టర్కీ వెళ్లారు. బయ్యర్స్ మాటగా అంతా వివరించారు. సినిమా విడుదల డిసెంబర్ అంటే రేటు ఎంత అంటే అంత పంపిస్తామంటున్నారని, థియేటర్లకు సమస్య వుండదని, అఖండ..పుష్ప లాంటి హిట్ లు డిసెంబర్ లో వున్నాయని వివరించుకు వచ్చారు.
అంతా వినేసి బాలయ్య కూల్ గా, అదంతా మీ సమస్య, జనవరిలోనే సినిమా విడుదల అన్నారు. అది కాదు, మాదే మరో సినిమా కూడా వుంది కదా అని నిర్మాతలు చెబితే..’ఆయన మొన్నే కదా వచ్చారు..నా సినిమా వచ్చి ఏడాది అయింది..అడ్జస్ట్ చేసుకోమనండి’ అని బాలయ్య చెప్పినట్లు తెలుస్తోంది. దాంతో నిర్మాతలు మరేం మాట్లాడలేక వెను తిరిగారని బోగట్టా.
ఇప్పుడు ఇంకో సమస్య కూడా వచ్చింది. ఎవరు ముందు? ఎవరు వెనుక? బాలయ్య సినిమా ముందా? మెగాస్టార్ సినిమా ముందా? అది కూడా ఇంకా తేలలేదు. దీనికి కూడా బాలయ్యనే ముహుర్తం పెట్టాల్సి వుంది. ఆయన డేట్ ఎంచుకుంటే మిగిలినది మెగాస్టార్ కు ఇస్తారు.
అంతా బాగానే వుంది. కానీ ఇక్కడ చిన్న అనుమానం. ఈ ఒప్పించేది, లెక్కలు చెప్పేది..అంతా మెగాస్టార్ కు ఎందుకు చేయడం లేదో, ఇండస్ట్రీ పెద్దగా పెద్దమనసు చేసుకుని ఆయన వెనక్కు వెళ్లే అవకాశం వుందేమో కదా?