అయితే గియితే ఇలాంటి డిమాండ్లు ఏ కమలం పార్టీ నేతో వినిపించాలి. ఇలాంటి వాదాన్ని వారు వినిపించి లబ్ధి పొందడం రివాజు. అయితే ఈ మధ్యకాలంలో ఒక రకమైన సాఫ్ట్ హిందుత్వ వాదాన్ని వినిపిస్తూ కమలం పార్టీ చిరాకును పుట్టిస్తున్నారు ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. తను హనుమాన్ భక్తుడిని అంటూ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రకటించుకుని మరీ గెలిచారు కేజ్రీవాల్.
కాంగ్రెస్ పార్టీపై బీజేపీ ఏ వాదంతో విరుచుకుపడుతూ ఉందో అందరికీ తెలిసిందే. తనపై ఈ దాడికి ఆస్కారం ఇవ్వకుండా కేజ్రీవాల్ ముందే జాగ్రత్తపడ్డారు. బీజేపీ హిందూ దేవుళ్ల పేర్లను ఎత్తుతుందనే వ్యూహానికి అనుగుణంగా కేజ్రీవాల్ ముందుకు సాగుతున్నారు. ఆఖరికి గాంధీ ని కూడా హిందుత్వ వాదులు ద్వేషించే పరిస్థితులు వచ్చిన నేపథ్యంలో.. కేజ్రీవాల్ తన మీటింగుల్లో అంబేద్కర్, భగత్ సింగ్ ల ఫొటోలను పెట్టుకుంటున్నాడు.
ఈ క్రమంలో భారతీయ కరెన్సీ మీద హిందూ దేవతల ఫొటోలను ప్రచురించాలంటూ కేజ్రీవాల్ డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్ తో ప్రధానమంత్రికి లేఖ కూడా రాయబోతున్నారట ఢిల్లీ సీఎం. లక్ష్మీదేవి, వినాయక చిహ్నాలను కరెన్సీపై ముద్రించాలని ఆప్ కన్వీనర్ డిమాండ్ చేస్తున్నారు. అప్పుడు తప్పనిసరిగా దేశ ఆర్థిక వ్యవస్థకు మేలు జరుగుతుందని కూడా కేజ్రీవాల్ అభిప్రాయపడుతున్నారు.
దేశ ఆర్థిక వ్యవస్థను రక్షించడానికి మోడీ తీసుకోవాల్సిన చర్యల్లో.. కరెన్సీపై వినాయక, లక్ష్మీదేవి ఫొటోలను ప్రచురించడం కూడా ఒకటని కేజ్రీవాల్ వాదిస్తున్నారు. ఇదే డిమాండ్ ను మోడీ ముందు కూడా ఉంచబోతున్నారట ఈయన. తన వాదానికి అనుకూలంగా ఇండోనేసియా కరెన్సీని కూడా కేజ్రీవాల్ ప్రస్తావించారు.
ముస్లిం దేశమైన ఇండోనేసియా కరెన్సీ పై వినాయకుడి ప్రతిమ ఫొటో ఉండే విషయాన్ని కేజ్రీవాల్ ప్రస్తావించారు. అలాంటిది ఇండియన్ కరెన్సీపై హిందూ దేవతల ఫొటోలు ఉండటంలో తప్పేంటని.. కేంద్రప్రభుత్వం ఈ చర్యలు తీసుకుని.. దేశ ఆర్థిక వ్యవస్థకు మేలు జరిగేలా చూడాలంటూ ఆప్ ముఖ్య నేత డిమాండ్ చేస్తున్నారు! మొత్తానికి బీజేపీకి మింగుడు పడేవి కావు ఈ డిమాండ్లు. ఇలాంటి డిమాండ్లు చేస్తే తాము చేయాలి తప్ప, ఇలా అడగడానికి కేజ్రీవాల్ ఎవరనే వాదన వినిపించగలరు కమలనాథులు.