అసెంబ్లీ ఫర్నీచర్ ను తీసుకెళ్లి తన ఇంట్లోకి, ఆఫీసుల్లోకి, వ్యాపార సంస్థల్లోనూ వాడుకున్న అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావుపై కేసు నమోదు అయ్యింది. అసెంబ్లీ ఫర్నీచర్ పక్కదారి పట్టడం, కోట్ల రూపాయల విలువైన, విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న ఆ ఫర్నీచర్ కోడెల శివరాం బైక్ షోరూమ్ లో వినియోగిస్తున్న వైనం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ ఆస్తులను ఇలా వ్యక్తిగత పనులకు వాడుకోవడం నేరం.
అధికారాన్ని ఉపయోగించుకుని అలా ఫర్నీచర్ ను పక్కదారి పట్టించి తమ వ్యాపారాలకు వాడుకున్నందుకు ఇప్పుడు కోడెల శివప్రసాద్ మీద కేసు నమోదు అయ్యింది. ఐపీసీ సెక్షన్లు కింద కోడెలపై కేసులు నమోదు అయినట్టుగా తెలుస్తోంది. అసెంబ్లీ సెక్షన్ ఆఫీసర్ ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు అయినట్టుగా సమాచారం. నిబంధనలకు విరుద్ధంగా ఫర్నీచర్ ను తరలించి వినియోగిస్తున్న నేరాల కింద కేసులు నమోదు అయ్యాయి.
కోడెల ఫర్నీచర్ దొంగతనం గురించి ఇప్పటికే ప్రజల నుంచి విస్మయం వ్యక్తం అవుతూ ఉంది. ఈ వ్యవహారంలో తెలుగుదేశం పార్టీనే బద్నాం అయ్యింది. ఈ దొంగతనాన్ని ప్రజలు కూడా అసహ్యించుకుంటున్నారని పరిశీలకులు చెబుతూ ఉన్నారు. అధికారం చేతిలో ఉంది కదా.. అని మరీ అడ్డగోలుగా వ్యవహరించిన వైనంపై విమర్శలు వస్తున్నాయి.