వైఎస్ఆర్ కాంగ్రెస్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల పాదయాత్ర సీన్లను వీక్షిస్తే జాలి కలగకమానదు. నిండా వంద మంది లేని సమూహంతో షర్మిల పాదయాత్ర సాగుతూ ఉంది. వారిని వెంటేసుకుని ఆమె ఎందుకు నడుస్తోందనే సందేహమూ కలుగుతుంది. షర్మిలకు యాత్ర చేపట్టడం కొత్త కాదు. మరో ప్రజాప్రస్థాన యాత్ర పేరుతో తన అన్న జగన్ జైల్లో ఉన్నప్పుడు షర్మిల ఒక సుదీర్ఘ యాత్రను చేపట్టింది.
తెలంగాణతో మొదలుకుని నాటి ఉమ్మడి ఏపీ ఆసాంతం ఆమె నడిచారు. చేవెళ్ల టూ ఇచ్చాపురం గా రాష్ట్రమంతా షర్మిల యాత్ర చేపట్టారు. ఆ యాత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉనికిని చాటింది. అనేక ఆటంకాలను ఎదుర్కొని ఆ యాత్రను పూర్తి చేసిన స్త్రీగా షర్మిల తన నాయకత్వ లక్షణాలను చాటుకున్నారు.
అయితే అప్పుడు షర్మిల వెనుక జగన్ అనేక శక్తి ఉంది. ఇప్పుడు జగన్ తో సంబంధం లేకుండా ఆమె పార్టీ పెట్టారు, రాజకీయంగా ఎదిగే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణలో షర్మిల పార్టీ పరిస్థితి ఏమిటని చూస్తే.. రాను రానూ గ్రాఫ్ మరి కొంత తగ్గిపోవడమే తప్ప మరో ప్రగతి కనిపించడం లేదు. పార్టీ ప్రకటించిన నాటి ఊపు కూడా ఇప్పుడు షర్మిల వైపు కనిపించడం లేదు!
షర్మిల చేపట్టిన దీక్షలు, ఆమె చేపడుతున్న యాత్ర.. తెలంగాణలోని ఏ వర్గాన్నీ పెద్దగా ఆకట్టుకుంటున్నట్టుగా లేదు. ఆమె పార్టీ వెనుక బీజేపీ ఉంది, కాదు ఆమె చేత పార్టీ పెట్టించింది కేసీఆర్ అనే పరస్పర ఆరోపణలు కూడా ఇప్పుడు లేవు! తెలంగాణ రాజకీయంలో షర్మిల ఇప్పుడు అంత తేలికైపోయింది.
ఇక మునుగోడు బై పోల్ ను షర్మిల బహిష్కరించారు. అది వీధిలో కుక్కల కొట్లాట అని కూడా ఆమె అంటున్నారు. అయితే బహిష్కరణ అని అన్నాకా.. ఇంకేం చెప్పినా పెద్ద విలువ ఉండదు. ఇక ప్రసంగాల్లో పరుష పదజాలాన్ని వాడితే తెలంగాణ రాజకీయంలో చొచ్చుకుపోవచ్చని షర్మిలకు ఎవరో గట్టిగా సూచించినట్టుగా ఉన్నారు. అయితే.. ఈ తీవ్రమైన వ్యాఖ్యలు కూడా పండటం లేదు. జనాదరణ అయితే మెరుగవ్వడం మాట అటుంచి, మొదట్లో ఈమెపై అంచనాలు పెట్టుకున్న వారు కూడా ఇప్పుడంత లేకపోవచ్చనే అభిప్రాయాలకు వస్తున్నారు.
మరి ఇదే తీరున సాగితే షర్మిల తెలంగాణ రాజకీయంలో అనామకురాలిగా నిలవొచ్చు. ఆమె విమర్శలకు ఇతర పార్టీలు స్పందించడం కూడా తగ్గిపోతోంది. గట్టిగా వందమందిని వెంటపెట్టుకోలేక షర్మిల సాగిస్తున్న యాత్ర కు ఏదో ఫలం దక్కుతుందని కూడా ఎవ్వరూ గట్టిగా వ్యాఖ్యానించలేని పరిస్థితి.