వైఎస్ఆర్సీపీ ఫ్లాప్ ల ద‌ర్శ‌కుడిని న‌మ్ముకుంటోందా!

ద‌ర్శ‌కుడిగా రామ్ గోపాల్ వ‌ర్మ క‌థ అయిపోయింద‌నేది ద‌శాబ్ద‌కాలంగా వినిపిస్తున్న విశ్లేష‌ణే. వ‌ర్మ పెన్నులో ఇంకు అయిపోయింద‌ని, వ‌ర్మ టేకింగు కొత్త పుంత‌లు తొక్కి ప్రేక్ష‌కుల‌ను విసిగిస్తోంద‌నే మాట చాలా కాలంగా వినిపిస్తోంది. అందుకు…

ద‌ర్శ‌కుడిగా రామ్ గోపాల్ వ‌ర్మ క‌థ అయిపోయింద‌నేది ద‌శాబ్ద‌కాలంగా వినిపిస్తున్న విశ్లేష‌ణే. వ‌ర్మ పెన్నులో ఇంకు అయిపోయింద‌ని, వ‌ర్మ టేకింగు కొత్త పుంత‌లు తొక్కి ప్రేక్ష‌కుల‌ను విసిగిస్తోంద‌నే మాట చాలా కాలంగా వినిపిస్తోంది. అందుకు త‌గ్గ‌ట్టుగా గ‌త ప‌దేళ్ల‌లో అత్యంత పేల‌వ‌మైన సినిమాల‌ను అందించాడు రామ్ గోపాల్ వ‌ర్మ‌. ఇక ఇదే క్ర‌మంలో వ‌ర్మ ప‌బ్లిసిటీ పాట్లుగా అనేక సినిమాలు వచ్చాయి, కొన్ని ప్ర‌క‌ట‌న‌ల‌తోనే ఆగిపోయాయి.

'క‌మ్మ రాజ్యంలో క‌డ‌ప రెడ్లు' అనే సినిమా ప్ర‌క‌ట‌న‌తో వ‌ర్మ ప‌బ్లిసిటీ పిచ్చి ప‌తాక స్థాయికి చేరింది. చివ‌ర‌కు టైటిల్ మార్చ‌బ‌డిన ఆ సినిమాలో ట్రైల‌ర్లో చూపినంత‌కు మించిన మ్యాట‌ర్ ఏమీ లేద‌ని తేలింది. పొలిటిక‌ల్ స్పూఫ్ గా కూడా ఆ సినిమా స‌క్సెస్ కాలేక‌పోయింది. ఆ త‌ర్వాత వ‌ర్మ విన్యాసాలు ర‌క‌ర‌కాలుగా సాగాయి. 

ఇలాంటి క్ర‌మంలో వ‌ర్మ మ‌రో పొలిటిక‌ల్ స్పూఫ్ నో, మ‌రో ఇంట్ర‌స్టింగ్ టైటిల్ నో ప్ర‌క‌టించినా అది ఆయ‌న రొటీన్ డ్రామాగానే మిగిల‌పోతుంది. ఈ ప‌రిస్థితుల్లో వ‌ర్మ‌కు ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ అపాయింట్ మెంట్ ఇవ్వ‌డం, సుదీర్ఘంగా చ‌ర్చించార‌నే మాట కాస్త ఆశ్చ‌ర్యాన్ని గొలుపుతోంది. దీనికి కొన‌సాగింపుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం వ‌ర్మ సినిమా చేయ‌బోతున్నార‌నే టాక్ కూడా వినిపిస్తోంది. 

మ‌రి ఇదే జ‌రిగితే.. అదో ప్ర‌హ‌స‌నం అనుకోవాలి. నిజంగానే తెలుగుదేశం పార్టీపై సినీమాధ్యమం ద్వారా వ్యంగ్యాస్త్రాన్ని సంధించాలంటే.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ‌ర్మ క‌న్నా మంచి ద‌ర్శ‌కుడే దొర‌క‌వ‌చ్చు! ప‌వ‌న్ క‌ల్యాణ్ పై సెటిరిక్ సినిమానో, వారి స్నేహంపై సినిమా తీయాల‌న్నా.. ఇండ‌స్ట్రీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మంచి ద‌ర్శ‌కులే దొరుకుతారు. 

వ‌ర్మ ప్ర‌క‌టించే సినిమాల్లో సెటైర్ ఉంటుంది, టైటిల్ క్యాచీగా ఉంటుంది కానీ.. అంత‌కు మించి మ్యాట‌ర్ ఉండ‌టం లేదు. కేవ‌లం టైటిల్ తోనే వ‌ర్మ ప‌బ్లిసిటీ మార్కెట్ చేసుకుంటాడు. అంతటితో ఆయ‌న‌కు తృప్తి. జ‌నాల‌కు విర‌క్తి. మ‌రి ప్ర‌త్య‌ర్థుల‌పై సినీ అస్త్రాన్ని సంధించాల‌నుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ‌ర్మ క‌న్నా బెట‌ర్ ఛాయిస్ గా ఎవ‌రినైనా చూసుకుంటే మేలేమో!