ఒకే కుటుంబంలో రెండు పార్టీలు. ఇది కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో చోటు చేసుకుంది. మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి బీజేపీలో, అలాగే మాజీ మంత్రి పి.రామసుబ్బారెడ్డి వైసీపీలో చేరడంతో టీడీపీకి దిక్కులేకుండా పోయింది. ఈ నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో టీడీపీ ఉనికే ఉండదని భావిస్తున్న తరుణంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.
మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి కుటుంబం నుంచే టీడీపీ ఇన్‌చార్జ్ నియామకం కావడం గమనార్హం. జమ్మలమడుగు టీడీపీ ఇన్ చార్జ్‌గా మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి అన్న దేవగుడి నారాయణరెడ్డి కుమారుడు భూపేష్‌రెడ్డిని చంద్రబాబు నియమించారు. అమరావతిలో శుక్రవారం రాత్రి నిర్వహించిన కడప టీడీపీ పార్లమెంట్ నియోజకవర్గ సమీక్ష సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు.
తాము జమ్మలమడుగులో పోటీ చేస్తామని గత కొంత కాలంగా దేవగుడి నారాయణరెడ్డి చెబుతూ వస్తున్నారు. తమ వర్గం చెల్లాచెదరు కాకుండా టీడీపీలో అన్న కుటుంబం కొనసాగేలా మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి చక్రం తిప్పారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఎన్నికల నాటికి జమ్మలమడుగులో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటాయని నియోజకవర్గ వాసులు చెబుతున్నారు. ఆ రోజుకు మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డో లేక అన్న కుమారుడో ఎవరో ఒకరు మాత్రమే బరిలో ఉంటారని నియోజకవర్గ వాసులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా భూపేష్ నియామకంతో ఎమ్మెల్సీ బీటెక్ రవి పులివెందుల నియోజకవర్గానికే మాత్రమే పరిమితం అవుతారు.