కడప జిల్లా బద్వేలు ఉప ఎన్నికకు ప్రధాన ప్రతిపక్షం టీడీపీ సిద్ధమైంది. వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ వెంకటసుబ్బయ్య ఆకస్మిక మృతితో బద్వేలుకు ఉప ఎన్నిక అనివార్యమవుతోంది.
తెలంగాణలోని హుజూరాబాద్‌తో పాటు బద్వేలుకు కూడా ఉప ఎన్నిక జరగనుంది. వైసీపీ అభ్యర్థిగా డాక్టర్ వెంకటసుబ్బయ్య సతీమణి డాక్టర్ సుధను ఆ పార్టీ ఎంపిక చేసింది. ఇప్పటికే ఆమె బద్వేలు నియోజక వర్గంలో ప్రచారానికి శ్రీకారం చుట్టారు.
ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ కూడా సమాయత్తమైంది. 2019లో డాక్టర్ వెంకటసుబ్బయ్యపై ఓటమిపాలైన ఓబులాపురం రాజశేఖర్‌నే తిరిగి నిలిపేందుకు చంద్రబాబు నిర్ణయించారు. ఒకప్పుడు బిజివేముల వీరారెడ్డి హయాంలో టీడీపీకి బద్వేలు కంచుకోటగా వుండేది. అనంతర రాజకీయ పరిణామాల్లో ఆ నియోజకవర్గం వైసీపీకి బలంగా తయారైంది.
ఈ నేపథ్యంలో అక్కడ తిరిగి వైసీపీనే గెలుస్తుందనే కారణంగా టీడీపీ కూడా సీరియస్‌గా తీసుకున్నట్టు కనిపించలేదు. కాకపోతే టీడీపీ శ్రేణుల్ని నిరాశపరచకుండా అభ్యర్థిని రంగంలో దింపేందుకు చంద్రబాబు నిర్ణయించారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
హుజూరాబాద్‌తో పోల్చుకుంటే బద్వేలులలో అసలు ఎన్నికల వాతావరణమే కనిపించడం లేదు. ఎందుకంటే ఇక్కడ విజయం ఎప్పుడో ఖాయం కావడమే.