హైదరాబాద్ లోని ఒక స్టార్ హోటల్లో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడి సన్నిహితులతో సమావేశం అయ్యి వార్తల్లోకి వచ్చిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ మళ్లీ హైకోర్టు తలుపుతట్టారు. తనను స్టేట్ ఈసీగా నియమించడం లేదని ఏపీ ప్రభుత్వంపై ఆయన కంప్లైంట్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే ఈ వ్యవహారం సుప్రీం కోర్టుకు చేరింది. అయితే నిమ్మగడ్డ మాత్రం మళ్లీ హై కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం గమనార్హం!
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ను నియమించే అధికారం ఏపీ ప్రభుత్వానికి ఉండదని ఇటీవలే హై కోర్టు తీర్పును ఇచ్చింది. ఆ తీర్పు ప్రకారం.. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎంపిక కూడా చెల్లదని స్పష్టం అవుతోంది. ఎందుకంటే.. ఈయనను నియమించింది చంద్రబాబు నాయుడి ప్రభుత్వం. అది కూడా రాష్ట్ర ప్రభుత్వ సిఫార్సు మేరకు జరిగింది కాబట్టి.. నిమ్మగడ్డ నియామకం కూడా చెల్లదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ మొత్తం వ్యవహారంపై సుప్రీం కోర్టును ఆశ్రయించింది ఏపీ ప్రభుత్వం.
సుప్రీం కోర్టు కూడా నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు తక్షణం బాధ్యతలు అప్పగించేయమని తీర్పులేవి ఇవ్వలేదు. అయితే ఇప్పటికే ఒకసారి తనను తాను ఎస్ఈసీగా నియమించేసుకుని వార్తల్లోకి వచ్చిన నిమ్మగడ్డ ఇప్పుడు అదే వ్యవహారం పై మళ్లీ హై కోర్టును ఆశ్రయించారు!
తనను తాను నియమించేసుకున్న ఆయన మళ్లీ కోర్టుకు వెళ్లడం ఒకింత విచిత్రమే. ఇక సుజనాచౌదరి, కామినేనిలతో తను ఎందుకు సమావేశం అయిన విషయంపై నిమ్మగడ్డ ఇప్పటి వరకూ వివరణ ఇవ్వలేదు. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న వారు ఇలాంటి సమావేశాలకు వెళ్లడం ఏమిటని సీపీఎం నేత మధులాంటి వారు కూడా విమర్శించారు. నిజాయితీగా ఉండాలి, నిజాయీతీగా కనిపించాలి కూడా.. అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో కూడా నిమ్మగడ్డ స్పందించలేదు. అయితే ఆయన ఈసీ పదవి కోసం మరోసారి కోర్టును ఆశ్రయించారు. హై కోర్టులో ఎలాంటి తీర్పు వస్తుందో ఈసారి!