గత రెండు సీజన్లలో రసవత్తరంగా సాగిన ఎలిమినేషన్ రౌండ్లు బిగ్ బాస్ సీజన్-3లో మాత్రం కామెడీ ఎపిసోడ్లను తలపిస్తున్నాయి. ఏ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనే విషయం 3 రోజుల ముందు నుంచే జనాలకు తెలిసిపోతుండడంతో ఎపిసోడ్లు కళ తప్పుతున్నాయి. మొదటిసారిగా హౌజ్ నుంచి బయటకు వెళ్లిన హేమ నుంచి ఇప్పటివరకు ఏ ఒక్క ఎలిమినేషన్ పై ఉత్కంఠ కనిపించలేదంటే.. సీజన్-3 ఎంత చప్పగా సాగుతుందో అర్థంచేసుకోవచ్చు. ఈవారం కూడా ఎలిమినేషన్ ముందుగానే తెలిసిపోయింది.
ఈవారం ఎలిమినేషన్ జాబితాలో ఏడుగురున్నారు. పునర్నవి, శివజ్యోతి, హిమజ, అషు రెడ్డి, రాహుల్, బాబా భాస్కర్, మహేష్ విట్ట ఎలిమినేషన్ రౌండ్ లో ఉన్నారు. వీళ్ల నుంచి అషు రెడ్డి ఈవారం బయటకురాబోతోందనే విషయం ఇప్పటికే అందరికీ తెలిసిపోయింది. దీంతో షోను నాగార్జున ఎంత రక్తి కట్టించాలని చూసినా, ఎంత ఉత్కంఠ పెంచాలని ప్రయత్నిస్తున్నా ఫలితం దక్కడంలేదు. జూనియర్ సమంతగా పేరుతెచ్చుకున్న అషురెడ్డి ఈవారం హౌజ్ నుంచి ఎలిమినేట్ అవ్వడం దాదాపు ఫిక్స్.
ఒక్క వైల్డ్ కార్డ్ ఎంట్రీ విషయంలోనే ఉన్నంతలో ఉత్కంఠ కొనసాగుతోంది. ఫస్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ కింద తమన్న సింహాద్రిని హౌజ్ లోకి పంపించిన నిర్వహకులు అభాసుపాలయ్యారు. తాము చేసింది ఎంత తప్పో వారం రోజుల్లోనే గ్రహించారు. ఈసారి అలాంటి తప్పులు రిపీట్ చేయకుండా ఓ హీరోయిన్ ను పంపించేందుకు ప్రణాళిక సిద్ధంచేశారు.
మొన్నటివరకు ఈ జాబితాలో హెబ్బాపటేల్, శ్రద్ధాదాస్ లాంటి పేర్లు వినిపించాయి. కానీ తాజాగా ఈషారెబ్బా పేరు వినిపిస్తోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈషానే ఈవారం వైల్డ్ కార్డ్ ఎంట్రీగా హౌజ్ లోకి వెళ్లే ఛాన్స్ ఉంది. ఈ విషయంలో మాత్రం కాస్త సస్పెన్స్ నడుస్తోంది. ఎలిమిషన్స్ లో మాత్రం ఎవ్వరికీ ఎలాంటి సందేహాల్లేవ్.