ఏపీ నూతన రాజధాని అమరావతి రాయలసీమ ప్రాంతానికి చాలాదూరమే అయినప్పటికీ అక్కడ భూములు కొనుగోళ్లు చేసిన వారిలో రాయలసీమ ప్రాంత రాజకీయ నేతలు ముందున్నారు. ఆ జాబితాలో ఉన్నదంతా తెలుగుదేశం పార్టీ నేతలే కావడం గమనార్హం. రాజధానిగా ఆ ప్రాంతాన్ని ఏర్పాటు చేస్తారనే లెక్కలతో వారు భారీఎత్తున భూములు కొనేశారు. తమపార్టీ అధికారంలో ఉన్నవేళ అలా అవకాశాన్ని ఉపయోగించుకున్నారు. ఇక ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో సదరు నేతలు హడలిపోతూ ఉన్నారని భోగట్టా!
రాజధానిని అమరావతి నుంచి మారుస్తున్నట్టుగా ఇప్పటివరకూ ప్రభుత్వం ఏమీ అధికారికంగా ప్రకటించలేదు. అయితే జగన్ ప్రభుత్వం అమరావతి విషయంలో ఆచితూచి స్పందించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మార్చబోతున్నట్టుగా తాము ఎక్కడా చెప్పలేదని ప్రభుత్వంలోని వారు స్పష్టం చేస్తున్నారు. తమ పార్టీ మెనిఫెస్టోలో కూడా అలాంటి విషయం ఏదీ ప్రకటించలేదని వారు చెబుతూ ఉన్నారు. కాబట్టి మార్పులేనట్టే.
అయితే అమరావతి ప్రాంతానికి అధికమైన ప్రాధాన్యత మాత్రం ఉండదని స్పష్టంగా చెప్పగలుగుతున్నారు అనేకమంది. చంద్రబాబు నాయుడు హయాంలో ప్రతిపాదనలోకి వచ్చిన వ్యవహారాలు కొన్ని ఇప్పటికే మరుగునపడ్డాయి. గ్రాఫిక్స్ లేవు, డిజైన్ల హడావుడి లేదు. అలాంటివి చేసి రియటెస్టేట్ వ్యాపారులకు ఊపునిచ్చారు చంద్రబాబు నాయుడు. అయితే ఆ బూమ్ ఎన్నికల సమయానికి ఢామ్ అనేసింది.
ఇక ఇప్పుడు జగన్ ప్రభుత్వం ఏమాత్రం హడావుడి చేయడంలేదు. ప్రతిగా వికేంద్రీకరణ రూటు పట్టేలా ఉంది. అదే జరిగితే అక్కడ రియల్ ఎస్టేట్ బూమ్ మరింత నేలచూపులు చూసే అవకాశాలు లేకపోలేదు. దీంతో అక్కడ తాము కొన్న ఆస్తుల విలువ భారీగాచఉందని లెక్కలేసుకున్న నేతలకు ఇప్పుడు చుక్కలు కనిపిస్తూ ఉన్నాయట.
ఇన్నిరోజులూ రాజధాని ప్రాంతంలో తాము కొన్న భూముల విలువ భారీగా పెరుగుతోందని, రాజకీయంగా ఎదురుదెబ్బ తిన్నా ఆర్థికంగా తమకు ఏ లోటూ లేదని వారు అనుకుంటూ వచ్చారు. అయితే జగన్ ప్రభుత్వ చర్యలు ఇలా భూములు కొనుగోలు చేసిన నేతలకు రుచించడం లేదు. అందుకే వారు తెగ ఇదైపోతూ ఉన్నారు.
రాజధానిని మార్చబోతున్నట్టుగా ప్రభుత్వం ఎక్కడా అధికారిక ప్రకటన చేయకపోయినా కొంతమంది రాయలసీమ తెలుగుదేశం పార్టీ నేతలు స్పందించేసిన విషయాన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. రాజధాని ప్రాంతంతో ఇప్పటివరకూ రాయలసీమ ప్రాంతానికి ఎలాంటి అనుబంధం ఏర్పడలేదు. కనీసం రోడ్డు సౌకర్యం కూడా సరిగాలేదు సీమ నుంచి. రాయలసీమ ప్రజలు అయితే హైదరాబాద్ కాకపోతే బెంగళూరు మీద ఆధాపడే బతుకీడుస్తూ ఉన్నారు.
అందుకే చంద్రబాబు నాయుడు రాజధాని విషయంలో ఎన్ని గ్రాఫిక్స్ చూపించినా అవి వర్కవుట్ కాలేదు. ఇప్పుడు జగన్ ప్రభుత్వం రాజధానిని మార్చినా, మార్చకపోయినా రాయలసీమలోని సగటు ప్రజలు మాత్రం దాన్ని పట్టించుకునే అవకాశాలులేవు. అయితే తెలుగుదేశం నేతలు మాత్రం తెగ రియాక్ట్ అవుతూ ఉన్నారు. మార్చబోతున్నట్టుగా ప్రభుత్వం అధికారిక ప్రకటన చేయకపోయినా వీరు మాత్రం స్పందించేస్తూ ఉన్నారు. ఇలా తమ ఆస్తుల విషయంలో ఆందోళనను వారు చాటుకుంటున్నారని పరిశీలకులు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు.