వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి టీడీపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు దీటైన కౌంటర్ ఇచ్చారు. ఇవాళ విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ అశోక్ గజపతిరాజుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సింహాచలానికి సంబంధించిన 800 ఎకరాలకు పైగా ఆస్తులు పరాధీనం అవుతుంటే అశోక్ గజపతిరాజు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.
అశోక్ గజపతిరాజు ధర్మకర్తనా.. లేక అధర్మకర్తా? అని నిలదీశారు. అక్రమాలు జరిగాయన్న దానిపై బహిరంగ చర్చకు రావాలని విజయసాయి రెడ్డి సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో విజయనగరంలో అశోక్ గజపతిరాజు స్పందించారు.
మాన్సాస్ ట్రస్టు ఛైర్మన్, బోర్డు సభ్యులుగా రాష్ట్ర ప్రభుత్వం ఎవరిని నియమించినా తనకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. కానీ ట్రస్టు సంప్రదాయాలను పాటించే విషయంలో అడ్డు రాకూడదని అశోక్ గజపతిరాజు స్పష్టం చేశారు. ట్రస్టు బోర్డు సభ్యులుగా అందరూ మహిళలనే తీసుకుంటే ఎవరైనా కాదన్నారా? అని ప్రశ్నించారు.
ట్రస్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అర్థరహితంగా ఉందని ఆయన అన్నారు. రాజకీయాలతో ఏమాత్రం సంబంధం లేని ట్రస్టుపై ఎందుకు దృష్టి పెట్టారో ఇప్పటికీ అర్థం కావడం లేదన్నారు. వైసీపీ అధికారంలోకి రాగానే ట్రస్టు భూము లపై ఎక్కువ దృష్టి పెట్టినట్లు అనిపిస్తోందన్నారు.
ఎప్పుడు మాట్లాడినా తనను జైలుకు పంపిస్తానని అంటున్నారని ఆయన గుర్తు చేశారు. బహుశా బెయిల్‌పై వచ్చిన పెద్దలకు జైలు అంటే చాలా ఇష్టం అనుకుంటా అని విజయసాయిరెడ్డిని పరోక్షంగా దెప్పి పొడిచారు. మాన్సాస్ ట్రస్టు విషయంలో విజయసాయిరెడ్డి, అశోక్‌గజపతిరాజు మధ్య మాటల యుద్ధం సాగుతోంది. చివరికి ఈ వ్యవహారం రాజకీయంగా ఎవరికి నష్టమో రానున్న రోజుల్లో తెలుస్తుంది.