కేంద్ర ప్రభుత్వంపై సర్వోన్నత న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది. దీనికి కోర్టు ఆదేశాలు పాటించకపోవడమే కారణం. మరో వైపు కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పు పట్టింది. తమ ఆదేశాలను కేంద్రం పాటించే సరికి పుణ్యకాలం కాస్త కరిగిపోతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం గమనార్హం.
కొవిడ్ మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు పరిహారం అందించాలని గతంలో కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఆదేశాలు అమలుకు నోచుకోలేదు. దీనిపై సుప్రీంకోర్టు ఘాటుగా స్పందించింది.
‘కొవిడ్ మృతులకు డెత్ సర్టిఫికెట్ల జారీ కోసం మార్గదర్శకాలను రూపొందించాలని చాలా రోజుల కిందటే ఆదేశాలిచ్చాం. వాటిని ఇప్పటికే ఒకసారి పొడిగించాం. మీరు మార్గదర్శకాలు సిద్ధం చేసేసరికి మూడో వేవ్ కూడా ముగిసిపోతుంది’ అని కేంద్ర ప్రభుత్వంపై జస్టిస్ ఎం ఆర్ షా, జస్టిస్ అనిరుద్ధ బోస్‌లతో కూడిన ధర్మాసనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
కరోనాతో మరణించిన వారి కుటుంబాలకు జాతీయ విపత్తు నిర్వహణ చట్టం ప్రకారం రూ.4 లక్షల చొప్పున పరిహారం చెల్లించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలంటూ దాఖలైన రెండు వేర్వేరు పిటిషన్లను సుప్రీం ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా కొవిడ్‌తో మరణించిన బాధిత కుటుంబాలకు పరిహారం అందించాలని జూన్ 30న ఇచ్చిన ఆదేశాలనూ ఎందుకు అమలు చేయడం లేదని ధర్మాసనం నిలదీసింది.
సాయం కింద ఎంత ఇవ్వాలన్న దానిపై తాము ఆదేశాలు ఇవ్వలేమని, కేంద్ర ప్రభుత్వమే కనీస మొత్తాన్ని నిర్ధరించాలని సుప్రీం కోర్టు సూచించింది. ఇదే సమయంలో పరిహారం చెల్లించడంతో పాటు, మరణ ధ్రువీకరణ పత్రాల జారీకి దేశవ్యాప్తంగా ఏకీకృత విధానానికి సంబంధించి మార్గదర్శకాలు రూపొందించాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం ధర్మాసనం సూచించింది.
ఇవి ఇంకా రూపొందించకపోవడంతో కేంద్రప్రభుత్వ తీరుపై పైన పేర్కొన్నట్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. కేంద్ర తరపున వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. కోర్టు ఆదేశాలన్నీ ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయని చెప్పుకొచ్చారు.