కాంగ్రెస్ అధ్యక్షుడిగా సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే అధికారికంగా నేడు బాధ్యతలు స్వీకరించనున్నారు. 24 ఏళ్లలో పార్టీకి నాయకత్వం వహించిన మొదటి గాంధీయేతర వ్యక్తిగా ఖర్గే నిలవనున్నారు. తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ నుండి ఖర్గేకు అధ్యక్ష పగ్గాలు అప్పగించే వేడుక కోసం కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో భారీ సన్నాహాలు జరుగుతున్నాయి.
ఉదయం 10.30 గంటలకు అఖిలభారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యాలయంలో మల్లికార్జునా ఖర్గే అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. కాంగ్రెస్ పార్టీ అధినేతగా మల్లికార్జునా ఖర్గే బాధ్యతలు చేపడుతున్న ఈ కార్యక్రమానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీతోపాటు పలువురు సీనియర్ నేతలు, ఇతర పార్టీల సీనియర్ నేతలు హాజరు కానున్నారు.
కర్నాటక అసెంబ్లీలో ప్రతిపక్షనాయకుడిగా, రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసిన ఖర్గే…పార్టీ అస్తిరంగా ఉన్న సమయంలో తన కొత్త పాత్రను పోషించేందుకు సిద్ధం అవుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ దేశంలోని అనేక రాష్ట్రాల్లో బీజేపీ నుండి గట్టి సవాలు ఎదుర్కొంటున్న సమయంలో 80 ఏళ్ల ఖర్గే పార్టీ బాధ్యతలు చేపట్టానున్నారు.