బాబు ప‌రువు తీసిన రామోజీ

ఎల్లో మీడియా ఆరాధ్య నాయ‌కుడు చంద్ర‌బాబు అన్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. నిత్యం చంద్ర‌బాబును భుజాల‌పై మోసే ఎల్లో మీడియా అత్యుత్సాహంలో ఆయ‌న ప‌రువు తీయ‌డం చ‌ర్చ‌కు దారి తీసింది. ఈ ప‌ని ఈనాడు…

ఎల్లో మీడియా ఆరాధ్య నాయ‌కుడు చంద్ర‌బాబు అన్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. నిత్యం చంద్ర‌బాబును భుజాల‌పై మోసే ఎల్లో మీడియా అత్యుత్సాహంలో ఆయ‌న ప‌రువు తీయ‌డం చ‌ర్చ‌కు దారి తీసింది. ఈ ప‌ని ఈనాడు మీడియా సంస్థ‌ల అధినేత‌ రామోజీరావు  చేశారంటే ఎవ‌రికైనా ఆశ్చ‌ర్యం క‌లిగిస్తుంది. ఈనాడు రాత పుణ్యాన చంద్ర‌బాబును ప్ర‌త్య‌ర్థులు, నెటిజ‌న్లు తీవ్ర‌స్థాయిలో సెటైర్స్ విసురుతున్నారు.

ఇవాళ ఈనాడు ప‌త్రిక‌లో “జ‌గ‌న్ మామా బ‌స్సులు వేయించు!” శీర్షిక‌తో చిన్న వార్త ప్ర‌చురిత‌మైంది. జ‌గ‌న్ ఫొటోతో విద్యార్థులు నిర‌స‌న తెలుపుతున్నార‌నేది వార్త సారాంశం. వార్త‌లోకి వెళితే ఆస‌క్తిక‌ర విష‌యాన్ని తెలుసుకోవ‌చ్చు. కుప్పం శివారులోని చీగ‌ల‌ప‌ల్లె పంచాయ‌తీ దానికి అనుబంధంగా ఉన్న నారాయ‌ణ‌పురం, హ‌నుమంత‌కొట్టాలు, పెద్ద‌న్న‌కొట్టాలు గ్రామాల‌ను పుర‌పాల‌క సంఘంలో క‌లిపి రెండో వార్డుగా చేశార‌ని, కానీ ర‌వాణా సౌక‌ర్యం మాత్రం లేదంటూ జ‌గ‌న్ ప‌రిపాల‌న‌ను త‌ప్పు ప‌డుతూ ఈనాడు వార్త రాసింది. 

ఇక్క‌డ 150 మంది విద్యార్థులు రోజూ 10 కి.మీ న‌డిచి కుప్పంలోని విద్యాసంస్థ‌ల‌కు వెళ్లాల్సి వ‌స్తోంద‌ని ఈనాడు తెగ బాధ‌ప‌డి పోయింది. జ‌గ‌న్ మామా…పాఠ‌శాల‌కు వెళ్లేందుకు బ‌స్సు సౌక‌ర్యం క‌ల్పించాల‌ని విద్యార్థులు ఆయ‌న ఫొటోతో నిర‌స‌న తెలిపార‌ని ఈనాడు ప‌త్రిక త‌న మార్క్ క‌థ‌నాన్ని ప్ర‌చురించింది.

అయితే కుప్పానికి 1989 నుంచి ప్రాతినిథ్యం వ‌హిస్తున్న చంద్ర‌బాబునాయుడు క‌నీసం విద్యార్థులు బ‌డికి వెళ్లేందుకు కూడా బ‌స్సు సౌక‌ర్యం క‌ల్పించక‌పోవ‌డంపై సిగ్గుప‌డాల‌ని నెటిజ‌న్లు, వైసీపీ నేత‌లు తీవ్ర‌స్థాయిలో మండిప‌డుతున్నారు. కుప్పాన్ని రెవెన్యూ డివిజ‌న్ చేయ‌డానికి జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి అయ్యే వ‌రకు చంద్ర‌బాబు ప్రాతినిథ్యం వ‌హిస్తున్న నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు ఎదురు చూడాల్సి వ‌స్తోంద‌ని వారు చెబుతున్నారు. 

క‌నీసం త‌న నియోజ‌క‌వ‌ర్గంలోని ప‌ల్లెల‌కు ర‌వాణా సౌక‌ర్యం క‌ల్పించ‌లేని చంద్ర‌బాబునాయుడు…ఇక రాష్ట్రానికి ఏం చేశారో అర్థం చేసుకోవ‌చ్చ‌ని, ఇందుకు ఇదే నిద‌ర్శ‌న‌మ‌ని నెటిజ‌న్లు దుమ్మెత్తి పోస్తున్నారు. మొత్తానికి రాష్ట్రాన్ని 14 ఏళ్ల పాటు పాలించిన చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గానికి కూడా ఏమీ చేయ‌లేద‌ని ఆయన భ‌గ‌వ‌ద్గీత‌గా అభివ‌ర్ణించిన ప‌త్రికే ఆధారంతో స‌హా నిరూపించింద‌ని నెటిజ‌న్లు వెట‌క‌రిస్తున్నారు.