Advertisement

Advertisement


Home > Politics - Gossip

బాబు సీఎం కాకూడదన్నదే బీజేపీ వ్యూహమా?

బాబు సీఎం కాకూడదన్నదే బీజేపీ వ్యూహమా?

విభజిత ఏపీకి చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు ఆయనతో ఎదురైన చేదు అనుభవాలను బీజీపీ ఇప్పటికీ ఇంకా మర్చిపోలేదు. వైసీపీ ఓడిపోవాలని బీజేపీకి (కేంద్ర నాయకత్వానికి) ఉందో లేదో చెప్పలేంగానీ చంద్రబాబు మళ్ళీ అధికారంలోకి రాకూడదని బలంగా కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. 

అధికారంలోకి వస్తే తమ పార్టీ రావాలని లేదా జనసేన రావాలని (బీజేపీ -జనసేన సంకీర్ణ ప్రభుత్వం) బీజేపీ కోరుకుంటున్నట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ సీఎం అయినా తమకు ఇష్టమేనని బీజేపీ కేంద్ర నాయకత్వం చెబుతున్నట్లు తెలుస్తోంది. 

మొన్న విశాఖ ఘటన తరువాత పవన్, బాబు కలుసుకున్న తరువాత, ఆ రెండు పార్టీలు ఎన్నికల్లో పొత్తు పెట్టుకుంటాయని తెలిసిన తరువాత వారిద్దరిని ఎలా విడదీయాలా అని బీజేపీ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. విజయవాడలో పవన్ ను చంద్రబాబు కలవడంతో బీజేపీ హైకమాండ్ అప్రమత్తమైంది. 

జనసేన చీఫ్ ను బీజేపీ పెద్దలు ఢిల్లీకి పిలిచారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా దూతగా సీనియర్ నేత బీఎల్ సంతోష్ దగ్గరుండి పవన్ ను ఢిల్లీకి తీసుకువెళ్లారని సమాచారం. పవన్ కోసం బీజేపీ పెద్దలే ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేశారట. ఢిల్లీలోని సఫ్దర్జంగ్ ఎయిర్ పోర్టులో బీజేపీ నేతలు పవన్ ను రిసీవ్ చేసుకున్నారు.

ఎయిర్ పోర్టు నుంచి పవన్ నేరుగా అమిత్ షా నివాసానికి వెళ్లారు. అమిత్ షాతో జరిగిన సమావేశంలో మూడు నాలుగు అంశాల్లో పవన్ కల్యాణ్ క్లారిటీ తీసుకున్నారని తెలుస్తోంది. బీజేపీ జగన్ కు అనుకూలమో, వ్యతిరేకమో చెప్పాలని సూటిగా అడిగారట. 

టీడీపీ విషయంలో బీజేపీ స్టాండ్ ఏంటో తెలుసుకున్నారట. ఈ సందర్బంగా పవన్ ను కూల్ చేస్తూ మాట్లాడిన అమిత్ షా.. జగన్ పై తమకేమి అసక్తి లేదని చెప్పారట. టీడీపీ విషయంలో ఆరెస్సెస్ తో పాటు ఇతర బీజేపీ వర్గాల నుంచి వ్యతిరేకత లేకున్నా ప్రధాని మోడీ మాత్రం టీడీపీకి సానుకూలంగా లేరని చెప్పినట్లు తెలుస్తోంది.

అయితే పవన్ కల్యాణ్ ను కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే.. 2014 తరహాలో మూడు పార్టీలు (టీడీపీ -బీజేపీ -జనసేన ) కలిసి పని చేసేందుకు సిద్ధమేననే సంకేతం ఇచ్చారని అంటున్నారు. చంద్రబాబును సీఎం చేయడానికి మనమెందుకు కష్టపడాలి అని పవన్ తో అమిత్ షా అన్నారని తెలుస్తోంది. 

నిన్ను ముఖ్యమంత్రిగా ప్రకటించమను... 25 ఎంపీ సీట్లలో మెజార్టీ సీట్లు గెలిచి చంద్రబాబును కేంద్ర కేబినెట్ లో చేరమని.. అలా అయితేనే మనం ముందుకు పోదాం అని సూచించారని సమాచారం. మరి అమిత్ షా చెప్పింది పవన్ బుర్రలో నాటుకుంటుందా? లేదా? అనేది తెలియదు.

తాను సీఎం కావాలని అనుకొని బీజేపీ ట్రాప్ లో పడిపోతే మాత్రం టీడీపీతో పొత్తు కుదరదు. ఎందుకంటే చంద్రబాబు తాను సీఎం కావాలనుకుంటారుగానీ పవన్ ను సీఎం చేయరు కదా. ఒకవేళ టీడీపీ -జనసేన పొత్తు కుదిరి ఆ కూటమి అధికారంలోకి వస్తే పవన్ కు ఉప ముఖ్యమంత్రితోపాటు కీలకమైన శాఖ కేటాయించవచ్చు. మొత్తం మీద అమిత్ షా పవన్ బుర్రలో ఒక బీజం పడేశారని అనుకోవాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?