వైసీపీ గర్జనకు టీడీపీ రియాక్షన్..?

విశాఖ రాజధాని కావాలని రావాలని ఈ నెల 15న విశాఖ గర్జనను సిటీలో నిర్వహించారు. జోరు వానలో సైతం గర్జన విజయవంతం అయింది. దీంతో విపక్షాలు దానికి ధీటైన కార్యక్రమాలు నిర్వహించాలని భావిస్తూ వస్తున్నాయి.…

విశాఖ రాజధాని కావాలని రావాలని ఈ నెల 15న విశాఖ గర్జనను సిటీలో నిర్వహించారు. జోరు వానలో సైతం గర్జన విజయవంతం అయింది. దీంతో విపక్షాలు దానికి ధీటైన కార్యక్రమాలు నిర్వహించాలని భావిస్తూ వస్తున్నాయి. రౌండ్ టేబిల్ కార్యక్రమం పేరిట అదే రోజున టీడీపీ కొంత హడావుడి చేసింది.

ఇపుడు చూస్తే ఉత్తరాంధ్రా సమస్యలు అంటూ మరో కార్యక్రమాన్ని టీడీపీ చేపడుతోంది. ఈ నెల 28 నుంచి నవంబర్ 3 వరకూ వారం రోజుల పాటు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని టీడీపీ నిర్ణయింది. అందులో రుషికొండ వద్ద నిరసనతో పాటు, దసపల్లా భూముల విషయంలో ఆందోళన, అరకులోయలో గంజాయి సాగు అమ్మకాల మీద నిరసన, చక్కెర కర్మాగారాల మూసివేతకు నిరసనగా అనకాపల్లిలో నిరసన. శ్రీకాకుళంలోని గొట్టం బ్యారేజి వద్ద సాగునీటి ప్రాజెక్టుల నిర్లక్ష్యం మీద నిరసన వంటివి ఉన్నాయి.

చిత్రమేంటి అంటే ఇందులో చాలావరకూ గత ప్రభుత్వంలో ఉన్న పాతుకుపోయిన సమస్యలే. చక్కెర కర్మాగారాలను టీడీపీ హయాంలోనే మూసివేశారు. గంజాయి సాగు కానీ ఏజెన్సీలో అక్రమ మైనింగ్ కానీ నాడు టీడీపీ ఏలుబడిలో ఎక్కువగా ఉంది అని వైసీపీ నేతలు అంటున్నారు. దసపల్లా భూముల లబ్దిదారులు కూడా ఒక సామాజిక వర్గం, ఒక రాజకీయ పార్టీ సానుభూతిపరులే అని కూడా అంటున్నారు.

ఇలా పాత సమస్యలు తమ ఏలుబడిలో ఉన్న సమస్యల మీద విపక్షంలోకి వచ్చాక మూడేళ్ళ తరువాత తీరుబాటు చేసుకుని నిరసన చేయడం అంటే అది కచ్చితంగా ఎదుటి వారి మీద గుడ్డ కాల్చి పడేయడమే అని వైసీపీ నేతలు అంటున్నారు. విశాఖ రాజధాని ఆకాంక్ష ఒక వైపు ఉంటె దాన్ని పక్కదోవ పట్టించడానికి ఇదంతా అంటున్నారు. ఇక సాగునీటి ప్రాజెక్టుల విషయంలో టీడీపీ నేతలు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని కూడా సూచిస్తున్నారు.