టాలీవుడ్‌ని మరోసారి డ్రగ్స్ వ్యవహారం వణికిస్తోంది. గతంలో డ్రగ్స్ కేసులో పలువురు నటీనటులు, డైరెక్టర్లను తెలంగాణ పోలీసులు విచారించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఊసే లేకపోవడంతో వ్యవహారం సర్దుమణిగిందని అందరూ భావించారు. దాదాపు మూడేళ్ల తర్వాత మళ్లీ డ్రగ్స్ వ్యవహారం తెరపైకి రావడం వెనుక రాజకీయ కారణాలేవైనా ఉన్నాయా? అనే చర్చ జరుగుతోంది.
కెల్విన్ ఇచ్చిన సమాచారం మేరకు ఈ కేసుకు సంబంధించి డైరెక్టర్ పూరి జగన్నాథ్, హీరోయిన్స్ చార్మీ, రకుల్ ఈడీ విచారణను ఎదుర్కొంటున్నారు. రానా దగ్గుబాటి, రవితేజతో పాటు డ్రైవర్ శ్రీనివాస్, నవ్‌దీప్, ఎఫ్-క్లబ్ జనరల్ మేనేజర్, ముమైత్ ఖాన్, తనీష్, నందు, తరుణ్లనూ ఈడీ అధికారులు విచారించనున్నారు.
టాలీవుడ్లో డ్రగ్స్ విచారణ ఎపిసోడ్ సంచలనం సృష్టిస్తున్న నేపథ్యంలో నటి పూనమ్ కౌర్ చేసిన ట్వీట్ సర్వత్రా ఆసక్తి కలిగిస్తోంది. ఇది కేవలం సినీ రంగానికి మాత్రమే పరిమితమైన అంశం కానే కాదని ఆమె అభిప్రాయపడుతున్నారు.
ఇంకా ఆమె ఏమంటున్నారంటే…. ''డ్రగ్స్ అనేది కేవలం సెలబ్రిటీల సమస్య కాదు. ఇది ప్రతి ఒక్కరి సమస్య. సరిహద్దు సమస్య. పొలిటికల్ అజెండాతో జరుగుతున్న వ్యవహారం. బలమైన ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన సమస్య. ఈ మొత్తం వ్యవహారంపై త్వరలోనే నా స్వీయ అనుభవాలను మీతో పంచుకుంటా.'' అని ట్వీట్ చేశారు. దీంతో పూనమ్ చెప్పే స్వీయానుభవాలు ఏంటనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది.