పవన్‌కు టీడీపీ రూపంలో గట్టి మద్దతు లభిస్తోంది. జనసేన, టీడీపీ మధ్య అధికారికంగా పొత్తు ఖరారు కాలేదు. కేవలం పవన్‌కల్యాణ్‌తో చంద్రబాబు భేటీ మాత్రమే జరిగింది. అది కూడా పవన్‌కల్యాణ్‌పై ప్రభుత్వం అణచివేత చర్యలకు పాల్పడుతోందంటూ ఆయనకు సంఘీభావం ప్రకటించేందుకు చంద్రబాబు వెళ్లారు. ఇద్దరూ కలిసి మాట్లాడుకున్న తర్వాత ఉమ్మడిగా ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఇకపై రెండు పార్టీలు కలిసి ముందుకు సాగుతాయని తేల్చి చెప్పారు.
అప్పటి వరకూ ఉన్న ముసుగు తొలగినట్టైంది. చంద్రబాబు, పవన్‌కల్యాణ్ కలిసిపోయేందుకు జగన్ ప్రభుత్వం తన వంతు కృషి చేస్తోంది. మహిళలకు క్షమాపణ చెప్పాలంటూ ఏపీ మహిళా కమిషన్ పవన్‌కు నోటీసు ఇవ్వడం చర్చనీయాంశమైంది. ఈ విషయంలో జనసేన కంటే టీడీపీనే ఎక్కువగా దూకుడు ప్రదర్శిస్తోంది. ఇలాగైతే వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఎంత మందికి నోటీసులు ఇస్తారని టీడీపీ నేతలు నిలదీయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
టీడీపీ అధికార ప్రతినిధులు వివిధ మాధ్యమాల వేదికగా పవన్‌కు మద్దతుగా మాట్లాడుతున్నారు. పవన్‌కు మూడు పెళ్లిళ్లైతే, వైఎస్ జగన్ కుటుంబంలో ఎవరికి ఎన్నెన్ని పెళ్లిళ్లు జరిగాయో లెక్కలేసి మరీ చెబుతుండడం గమనార్హం. ఈ లెక్కలన్నీ పవన్‌కోసం టీడీపీ బయటికి తీస్తున్నవే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే జనసేన శ్రేణులకు టీడీపీ శ్రేణులతో పోలిస్తే… అలాంటి తెలివితేటలు తక్కువే.
పవన్‌ను జగన్ ప్రభుత్వం ఎంత ఇరకాటంలోకి నెట్టితే అంత మంచిదని టీడీపీ భావిస్తోంది. టీడీపీ కోరుకున్నదే వైసీపీ కూడా చేస్తోంది. పవన్‌ను గెలికి అనవసరంగా పెద్దవాడిని చేస్తోందన్న విమర్శ లేకపోలేదు. అధికార పార్టీ రెచ్చగొట్టే కొద్ది టీడీపీకి జనసేన మరింత చేరువ అవుతోందన్నది నిజం. రానున్న కాలంలో ఏపీ రాజకీయాలు మరెన్ని మలుపులు తిరుగుతాయో చూడాలి.