చెప్పిన మాటలు.. చేసిన వాగ్దానాలు.. అన్నీ ఏనాడో మంట కలిసిపోయాయి.. చేసిన వంచనలు అన్నీ ప్రజలు మరచిపోయారని అనుకుంటున్నారో ఏమో తెలియదు గానీ, ప్రధాని నరేంద్ర మోడీ తగుదునమ్మా అంటూ విశాఖపట్నం పర్యటనకు వస్తున్నారు. ఈ దేశానికి ప్రధానిగా దేశవ్యాప్తంగా ఏ ప్రాంతంలోనైనా అడుగుపెట్టడానికి ఆయనకు అధికారం, సర్వహక్కులు ఉన్నాయి.
అయితే ప్రత్యేకించి తాను మోసగించిన ప్రాంతంలోనే అడుగుపెట్టేటప్పుడు కాస్త ఆత్మ పరిశీలన కూడా అవసరం. ప్రధాని నరేంద్ర మోడీకి అలాంటి ఆత్మ పరిశీలన ఉన్నదో లేదో తెలియదు గాని.. విశాఖ వాసులలోని చైతన్యం ప్రధానికి తమ నిరసనను తెలియజేస్తుందా? లేదా? అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా ఉంది.
విశాఖపట్నంలో రైల్వే స్టేషన్ ను 400 కోట్ల రూపాయలతో ఆధునికరించే పనుల శంకుస్థాపన కోసం ప్రధాని నరేంద్ర మోడీ నవంబర్ 11వ తేదీన రానున్నారు. కేంద్ర ప్రభుత్వ శాఖల పరంగా చేపట్టే మరికొన్ని కార్యక్రమాలకు కూడా ఆయన ఆ రోజున హాజరవుతారు. అయితే మోడీ పర్యటనను విశాఖపట్నం నగరం హృదయపూర్వకంగా స్వాగతిస్తుందా? లేదా? అనేది మిలియన్ డాలర్ ప్రశ్న.
మోడీ ప్రభుత్వం సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అనేక రకాలుగా అన్యాయం జరిగిందనే సంగతి అందరికీ తెలుసు. పదేళ్లపాటు ఇస్తానని హామీ ఇచ్చిన ప్రత్యేక హోదా అసలు ఇవ్వకుండా యావత్ రాష్ట్రాన్ని చాలా ఘోరంగా వంచించారు. ఆ మోసం తాలూకు గాయం ఈ రాష్ట్ర ప్రజలను మరికొన్ని దశాబ్దాలు గడిచిన తర్వాతి వరకు కూడా ఎప్పటికీ సలుపుతూనే ఉంటుంది.
ప్రత్యేక హోదా ద్వారా రాగల అభివృద్ధి అవకాశాలను విశాఖపట్నం ప్రాంతం కూడా సమానంగా కోల్పోయింది. దానిని మించి ప్రత్యేకంగా విశాఖపట్నం ఇస్తామని ప్రకటించిన విభజన చట్టంలో.. స్పష్టంగా పేర్కొన్న రైల్వే జోన్ విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తూ మోసం చేస్తోంది. ఇస్తామని ఒకసారి.. ఇవ్వడం సాధ్యం కాదని ఒకసారి.. అలాంటి ఆలోచన లేదని ఒకసారి.. రకరకాలుగా మాటలు మారుస్తూ ప్రజలను ఏమార్చుతోంది.
అంతకంటే ఘోరంగా విశాఖపట్నం ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరిస్తామని ఆలోచన ఇక్కడ ప్రజలకు అశనిపాతం. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఎంతో కాలంగా పోరాటాలు ఉద్యమాలు నిరసన దీక్షలు జరుగుతున్నప్పటికీ.. ప్రభుత్వం నుంచి ఇప్పటిదాకా నామమాత్రపు స్పందన కూడా లేదు. కనీసం వారి మొర ఆలకించిన వారు లేరు. ఇన్ని రకాలుగా విశాఖపట్నం వాసులు కేంద్ర ప్రభుత్వపు దుర్మార్గ పోకడల మీద క్రోధంతో రగిలిపోతూ ఉంటే ప్రధాని నరేంద్ర మోడీ ఆ నగరంలోనే పర్యటనకు వస్తూ ఉండడం గమనార్హం.
మోడీకి విశాఖ వాసులు తమ నిరసనను చూపిస్తారా అనే మీమాంస ఇప్పుడు రాష్ట్ర ప్రజల్లో కలుగుతోంది. గతంలో మోడీ చెన్నై పర్యటించిన సందర్భంలో తమిళ సోదరులు చాలా ఘాటుగా తమ వ్యతిరేకతను చూపించారు. అలాంటి స్ఫూర్తి విశాఖపట్నంలో కనిపిస్తుందా లేదా అనే చర్చ ప్రజల్లో నడుస్తోంది.