సోషల్ మీడియా క్రిమినల్స్! మీరు కచ్చితంగా దొరుకుతారు

మనుషుల్లోని వికారాలు ఇప్పటివి కావు. సృష్టి ఆది నుంచీ ఉన్నాయి. అయితే ఆయా వికారపు ఆలోచనలు ఆయా మనుషుల్లోనే ఉంటూ ఉండేవి. వారిని తారసపడిప్పుడే అవి బయటపడేవి. కానీ ఇప్పుడు సోషల్ మీడియా యుగంలో…

మనుషుల్లోని వికారాలు ఇప్పటివి కావు. సృష్టి ఆది నుంచీ ఉన్నాయి. అయితే ఆయా వికారపు ఆలోచనలు ఆయా మనుషుల్లోనే ఉంటూ ఉండేవి. వారిని తారసపడిప్పుడే అవి బయటపడేవి. కానీ ఇప్పుడు సోషల్ మీడియా యుగంలో ఆ వికృతాలు, బూతులు, అసహ్యకరమైన రాతలు మొదలైనవన్నీ అందరికీ పంచబడుతున్నాయి. ప్రశాంతతని చెడగొడుతున్నాయి. సభ్యతని కుక్కలు చింపిన విస్తరి చేస్తున్నాయి. 

ఉన్న సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అసహ్యాన్ని వెదజల్లుతున్నవాళ్లే కోకొల్లలుగా ఉంటే ఎవడికి వాడు ఫేక్ అకౌంట్స్ సైతం క్రియేట్ చేసి మరిన్ని వికృతాలకి పాల్పడుతున్నారు. 

ఒక పార్టీ అధినేత కుటుంబానికి చెందిన స్త్రీపై ఒక అభియోగం వేస్తే, మరొక పార్టీ అధినేత కుటుంబంలోని మహిళపై మరొకడు మరో రకమైన పోస్టు…సభ్యత మరిచి, సంస్కారం విడిచి రెచ్చిపోతున్నారు. 

నిజానికి ఇలాంటి పనులు చేయమని ఇరువర్గాల పార్టీ అధినేతలు చెప్పరు. ఇలాంటి పోస్టులు పెట్టే వెధవల్ని అనకుండా పార్టీల వాళ్లు నువ్వు చేయించావంటే నువ్వు చేయించావంటూ పరస్పరం దూషించుకుంటున్నారు. 

ప్రతి దానికి రాజకీయ రంగు అద్దుతున్నది పార్టీ నాయకులే. ఇదంతా చూస్తూ ఆ పోస్టులు పెడుతున్నవాళ్లు పైశాచికానందంతో తమ చేతికి మట్టి అంతట్లేదు కదా అని మరింత రెచ్చిపోతున్నారు. 

ఇలాంటి ఫొస్టులు పెట్టే వాళ్లని తక్షణమే అరెస్టు చేసి లోపలేసేసే కార్యక్రమమో, మరొకటో జరుగుతుండాలి. కంప్లైంట్ ఇస్తేనే అని కాకుండా కొన్ని సందర్భాల్లో పరిస్థితిని గమనించి సుమోటోగా చర్యలు తీసుకునే వ్యవస్థ ఉండాలి. 

చాలా మంది క్రిమినల్స్ అనుకునేదేంటంటే ..ఓపెన్ చేసింది ఫేక్ అకౌంటే కదా ఇక దొరకంలే అని! కానీ టెక్నాలజీ మొత్తం పోలీసు వ్యవస్థ గుప్పెట్లో ఉంది. ఎవడినైనా ఐ.పీ అడ్రస్సులతో ఇట్టే పట్టేయొచ్చు. ప్రాక్సీ వీపీఎన్ లు వాడినా కూడా పట్టుబడిపోయే పరిస్థితులు ఇప్పుడున్నాయి. అలా పట్టుకోవడానికి రకరకాల ఉచ్చులు పోలీసులదగ్గరున్నాయి. 

ఆ మధ్య గోరంట్ల మాధవ్ వీడియో ఎక్కడినుంచి అప్లోడయ్యిందో, ఆ వీడియోకి సంబంధించిన ఫేక్ ధృవీకరణ పత్రం ఎక్కడ ఎవరు తయారు చేసి పెట్టారో కూడా పోలీసులు ఛేదించేసారు. 

ఇలాంటివి హై ప్రొఫైల్ కేసుల్లోనే జరుగుతాయి..సామాన్యులు ఏం చెయ్యలేరులే అనుకుంటే అంతకంటే అమాయకత్వం మరొకటి ఉండదు. 

ఇదే విషయంలో సుప్రసిద్ధ టెక్ నిపుణులు, పోలీస్ అకాడమీ ఫ్యాకల్టీ అయిన శ్రీధర్ నల్లమోతు తన ఫేస్బుక్ అకౌంట్లో ఒక సోషల్ మీడియా క్రిమినల్ గురించి చెబుతూ ఇలా పోస్ట్ చేసారు: 

“ఇతని పేరు రాజేష్.. ఈస్ట్ గోదావరికి చెందిన వ్యక్తి. ఫేస్‌బుక్‌లో అమ్మాయిల ఫొటోలు సేకరిస్తాడు. 

వాళ్ల థంబ్ నెయిల్ పెట్టి “నా పేరు కుమారి, నా పేరు సరళ.. నా భర్త వదిలేశాడు, బాగా చూసుకునే మొగుడు కోసం చూస్తున్నాను” అని కేప్షన్‌లో పెడతాడు.

అది చూసి చాలామంది దగుల్భాజీ వ్యూయర్స్ ఆ వీడియో క్లిక్ చేస్తారు. అందులో ముందే రాసుకున్న స్క్రిప్ట్‌తో పెద్ద స్టోరీ వాయిస్ ఓవర్‌లో చదువుతాడు. 

“నా పేరు కుమారి, మాది రాజమండ్రి, అన్యోన్యంగా ఉన్న కాపురంలో సడన్‌గా గొడవలు అయ్యాయి. ఇప్పుుడు ఏం చేయాలో తెలీట్లేదు. నన్ను ప్రేమగా చూసుకునే మగతోడు కోసం చూస్తున్నాను” అంటూ వాయిస్ ఓవర్ పెడతాడు. 

సరిగ్గా మిత్రురాలు, ప్రముఖ యాంకర్ లతా చౌదరి గారి పేరు మీద కూడా ఇలాగే చేశాడు. కొద్దిరోజుల క్రితం ఆమె నాకు కాల్ చేస్తే నాకు తెలిసిన పరిష్కారం చెప్పాను. 

పోలీసుల సహకారంతో ఏబీయన్ లో మిత్రుడు క్రైమ్ రిపోర్టర్ ఇన్నారెడ్డి ఇతర టీమ్ సహకారంతో మొత్తానికి అతన్ని పట్టుకుని దేహశుద్ధి చేశారు. ఈ మొత్తం వ్యవహారంలో పోలీసుల చొరవ ప్రశసించదగ్గది. 

మహిళలు ఇలాంటి వేధింపులు అస్సలు ఉపేక్షించకండి. ఎవరినైనా ఈజీగా పట్టుకోవచ్చు. పోరాట పటిమ చూపిన లతా చౌదరి గారికి అభినందనలు”. 

కనుక ఎవ్వడూ తపించుకోలేడన్నది ఇక్కడి బాటం లైన్. ఈ వ్యాసం ద్వారా యువతకి చెప్పేది ఒకటే. మీ వికృతాలు మీలోనే దాచుకోండి. బయటకు ప్రదర్శించాలనుకుంటే కటకటాలు లెక్కించక తప్పదు. సోషల్ మీడియాలో మహిళలతో ఆడుకోవాలనుకుంటే ఆ ఆలోచనకి స్వస్తి పలకడం మంచిది. 

– శ్రీనివాసమూర్తి