ఏరు దాటే వరకు ఓడ మల్లన్న…ఏరు దాటాక బోడి మల్లన్న అన్నాడు అన్నది వెనకటికి సామెత. టాలీవుడ్ లో ఓ నిర్మాత వ్యవహారం ఇలాగే వుందని గ్యాసిప్ వినిపిస్తోంది. ఇంతకీ ఇక్కడ ఏం జరిగిందీ అంటే…ఆ మధ్య ఓ సినిమా బాక్సాఫీస్ దగ్గర చాలా దారుణంగా బోల్తా కొట్టింది.
సినిమా విడుదలకు ముందు నిర్మాత..హీరో ఎంతలా అభిమానంతో ముందుకు సాగారు అంటే వర్ణించలేము. ఇంత మంచి నిర్మాత లేరు అని హీరో, ఇంత గొప్ప హీరో లేడు అని నిర్మాత తెగ పరస్పర పొగడ్తలు కురిపించారు. బహిరంగంగానే తాము హీరోకి పారితోషికం ఇంకా ఇవ్వలేదు అని, ఎప్పుడు ఇస్తాం అన్నా తరువాత తీసుకుంటా అని చెప్పారని చెప్పుకొచ్చారు.
ఇదంతా సినిమా విడుదలకు ముందు సంగతి. కట్ చేస్తే సినిమా విడుదల తరువాత సీన్ మారిపోయింది. సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టేసింది. ఇప్పుడు అసలు వ్యవహారం మొదలైంది. హీరోకి నిర్మాత మొహం చాటేసారు. రెమ్యూనిరేషన్ ఇవ్వాలన్న సంగతి మరిచిపోయారు. హీరో తరపున వ్యవహారాలు చూసే వ్యక్తి ఫోన్ లు చేస్తుంటే రెస్పాన్స్ లేదని తెలుస్తోంది.
ఫోన్ లకు రెస్పాన్స్ ఇవ్వడం లేదని, పర్సనల్ గా కలిసే ప్రయత్నం చేస్తున్నా బిజీ అని కబురు వస్తోంది తప్ప కలవడం లేదని టాక్ వినిపిస్తోంది. సినిమా ఫ్లాప్ అయినా, మార్కెట్ చేయడం ద్వారా మాంచి లాభాలు వెనకేసుకున్నారని, కానీ రెమ్యూనిరేషన్ అనేసరికి మొహం చాటేసారని హీరో ఫీలవుతున్నట్లు తెలుస్తోంది.