నమ్మి తెలంగాణ పీసీసీ అధ్యక్ష బాధ్యతల్ని రేవంత్‌రెడ్డి అధిష్టానం కట్టబెడితే… ఆయన మాత్రం డేంజర్ గేమ్ ఆడుతున్నారనే అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. అది కూడా అత్యంత ప్రజాదరణ కలిగిన వైఎస్సార్‌తో గేమ్ ఆడడం అంటే నిప్పుతో చెలగాటం ఆడడమే అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అందర్నీ కలుపుకుని ముందుకు పోవాల్సిన రేవంత్… ఆ పని చేయకుండా పీసీసీ పదవిని సొంత పార్టీ నేతలపై పెత్తనం చేయడానికి దుర్వినియోగం చేస్తున్నారనే విమర్శలొస్తున్నాయి.
ముఖ్యంగా వైఎస్ మనుషులను కాంగ్రెస్‌లో లేకుండా చేయాలనే పనిలో రేవంత్ ఉన్నా రనే చర్చ జరుగుతోంది. ఉదాహరణకు వైఎస్ విజయలక్ష్మి హైదరాబాద్‌లో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి ఎవరూ వెళ్లకూడదని రేవంత్‌రెడ్డి హుకుం జారీ చేయడాన్ని రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ముందొచ్చిన చెవుల కంటే వెనుకొచ్చిన కొమ్ములే వాడి అనే చందంగా తయారైందనే ఆరోపణలున్నాయి.
మొదటి నుంచీ కాంగ్రెస్‌ను అంటిపెట్టుకుని ఉన్నవాళ్ల కంటే…టీడీపీ నుంచి వచ్చిన వాళ్ల ఆధిపత్యం పెరిగింది. అది ఎంతగా అంటే, పేరుకే కాంగ్రెస్ తప్ప, అధికారం, పెత్తనం అంతా టీడీపీ నుంచి వచ్చిన నేతలదే అనే స్థాయిలో. ఇంతకూ తాము కాంగ్రెస్‌లో ఉన్నామా? టీడీపీలో ఉన్నామా? అని తమను తాము నాయకులు అనుమానించుకునే పరిస్థితి.
విజయలక్ష్మి నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనం రాజకీయ ప్రేరేపితంగానే భావిస్తున్నామని, ఈ సమ్మేళానికి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరూ వెళ్ల వద్దంటూ టీపీసీసీ ఒక ప్రకటించింది. అలాగే ఈ సమ్మేళనానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎందుకు రావడం లేదో చెప్పాలని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. రాహుల్‌ను ప్రధాని చేయడమే తన లక్ష్యంగా వైఎస్సార్ చివరి రోజుల్లో ప్రకటించారని, విజయమ్మ, ఆమె తనయ షర్మిల అందుకోసం పని చేస్తామని ప్రకటిస్తే సమ్మేళనానికి వెళ్తామని రేవంత్‌రెడ్డి ప్రకటించారు.
మరి చంద్రబాబునాయుడికి సీతక్క రాఖీ కట్టడానికి ఏ షరతు విధించారని వైఎస్సార్ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు ఏమైనా రాహుల్‌ను ప్రధాని చేస్తానని ప్రకటించారా? అని ప్రశ్నిస్తున్నారు. రాజకీయం వేరు, వ్యక్తిగత సంబంధాలు వేరని సీతక్క చెప్పడాన్ని ఈ సందర్భంగా వైఎస్సార్ అభిమానులు గుర్తు చేస్తున్నారు. ఇది వైఎస్సార్‌ను అభిమానించే వారికి వర్తించదా? అని ప్రశ్నిస్తున్నారు. అందులోనూ వైఎస్సార్ పక్కా కాంగ్రెస్ ముఖ్యమంత్రి అని చెబుతున్నారు.
రాహుల్‌ను ప్రధాని చేయడమే తన లక్ష్యమని వైఎస్సార్ ప్రకటించినప్పుడు… తమరు ఏ పార్టీలో ఉన్నారో చెప్పాలని రేవంత్‌ను నిలదీస్తున్నారు. ఒకవైపు పైకి మాత్రం వైఎస్సార్‌పై అభిమానాన్ని ప్రదర్శిస్తూనే, మరోవైపు ఆయన మనుషులను కాంగ్రెస్ నుంచి వెళ్లగొట్టేందుకు రేవంత్ గోతులు తీస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కాంగ్రెస్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ సతీమణి రాజకీయాలకు అతీతంగా నిర్వహిస్తున్న సమ్మేళననానికి వెళ్లకూడదని ఆదేశాలు ఇవ్వడం వెనుక ఏ కాంగ్రెసేతర నాయకత్వ ఆదేశాలున్నాయో అందరికీ తెలుసనే చర్చ జరుగుతోంది. వైఎస్సార్‌పై విషం కక్కే చర్యలు కాంగ్రెస్‌కు, రేవంత్‌కు తీవ్ర నష్టం కలిగిస్తాయనే అభిప్రాయాలున్నాయి.