కరోనా వ్యాక్సిన్ వేయించుకోలేదా.. అయితే వైన్ కట్..!

వ్యాక్సిన్ వేయించుకున్నవారికే రేషన్ సరకులు, వ్యాక్సిన్ వేయించుకుంటేనే గ్యాస్ బుక్ చేసుకునే సదుపాయం అంటూ చాలా రకాల కండిషన్లు విన్నాం. తాజాగా.. వ్యాక్సిన్ వేయించుకుంటేనే మద్యం కొనుగోలుకి అర్హత అంటూ కొత్త లింకు పెట్టారు.…

వ్యాక్సిన్ వేయించుకున్నవారికే రేషన్ సరకులు, వ్యాక్సిన్ వేయించుకుంటేనే గ్యాస్ బుక్ చేసుకునే సదుపాయం అంటూ చాలా రకాల కండిషన్లు విన్నాం. తాజాగా.. వ్యాక్సిన్ వేయించుకుంటేనే మద్యం కొనుగోలుకి అర్హత అంటూ కొత్త లింకు పెట్టారు. అయితే తెలుగు రాష్ట్రాల మందుబాబులు ఈ నిబంధన చూసి భయపడక్కర్లేదు. 

ఇది ప్రస్తుతం తమిళనాడులో అమలులో ఉంది. నీలగిరి జిల్లాలో దీన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు అధికారులు. భారత్ లో వ్యాక్సిన్ నిర్బంధం కాదు, అలాగని స్వచ్ఛందంగా జనాలు వస్తారా అంటే అదీ లేదు. వ్యాక్సిన్ కొరత ఉన్నప్పుడు మాత్రం గుంపులు గుంపులుగా చేరి హడావిడి చేశారు. 

ఇప్పుడు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎవరికి వారు మాకెందుకులే అంటూ సైలెంట్ గా ఉన్నారు. ఈ నిర్లక్ష్యం కొనసాగితే మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంది, మూడో ముప్పు తప్పదు అనే ఆందోళనా ఉంది. అందుకే ఎక్కడికక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త కొత్త నిబంధనలు తెరపైకి తెస్తున్నాయి. ఇది కూడా అలాంటి కండిషనే.

కర్నాటకలోని కొన్ని ప్రాంతాల్లో వ్యాక్సిన్ తీసుకున్నవారికే రేషన్ సరకులు ఇచ్చేలా నిబంధన పెట్టారు. దీంతో రేషన్ కోసమైనా చాలామంది వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఇప్పుడదే రూల్ తమిళనాడులో మందుబాబులకు అమలు చేస్తున్నారు.

కరోనాని భయపెట్టే అసలు సిసలు వ్యాక్సిన్ మందేనంటూ మత్తులో తూగే మందుబాబులకు తమిళనాడులోని నీలగిరి జిల్లా అధికారులు షాకిచ్చారు. ఆధార్ కార్డ్, కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నట్టు ధృవీకరణ పత్రం చూపిస్తేనే ఇకపై మందు అమ్ముతామని చెప్పారు. దీంతో చాలామంది కంగారు పడ్డారు. మొదటి రోజు పక్కవారిని బతిమిలాడి మందు తెప్పించుకున్నా.. రెండోరోజు మాత్రం ఎవరికి వారే వైన్ షాపు కంటే ముందు వ్యాక్సినేషన్ సెంటర్ కి వెళ్తున్నారు.

అలా వ్యాక్సిన్ వేయించుకున్నారో లేదో, అట్నుంచి అటే వైన్ షాపు కి బయలుదేరుతున్నారు. మొత్తమ్మీద వైన్ షాపుకి, వ్యాక్సినేషన్ కి పెట్టిన ఈ లింకు అక్కడ బాగానే వర్కవుట్ అవుతోంది. దీంతో దీన్ని రాష్ట్రం మొత్తం విస్తరించే ఆలోచనలో ఉంది తమిళనాడు ప్రభుత్వం.