టీడీపీ సీనియర్ నేత, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే బుచ్చయ్యచౌదరి అసంతృప్తి టీ కప్పులో తుపాను మాదిరైంది. అధినేత చంద్ర బాబుతో భేటీ అనంతరం పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలన్న ఆలోచనను వెనక్కి తీసుకుంటున్నట్టు ఆయన ప్రకటించారు. అయితే చంద్రబాబు, లోకేశ్‌లపై తిట్లను వెనక్కి తీసుకోగలరా బుచ్చయ్య అని టీడీపీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. బుచ్చయ్య చౌదరికి అండగా నిలిచి తాము నష్టపోయామని ఆయన అనుచరులు వాపోతున్నారు. బుచ్చయ్య చౌదరి తప్పులపై తప్పులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ మాత్రం సంబడానికి మీడియాకు ఎక్కి రాద్ధాంతం చేయడం దేనికనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. చంద్రబాబు, లోకేశ్ తాను ఫోన్ చేస్తే అసలు రిసీవ్ చేసుకోరని బుచ్చయ్య ఇటీవల మండిపడిన సంగతి తెలిసిందే. చంద్రబాబు అంటే వయసులో పెద్ద వారని, లోకేశ్‌కు ఏమైందని బుచ్చయ్య ఘాటుగా ప్రశ్నించడం తెలిసిందే. ఇలాగైతే పార్టీ బతికి బట్ట కట్టేదెట్టా? అని ఆయన ప్రశ్నించి టీడీపీని ఇరుకున పెట్టారు.
మరోవైపు వివిధ సామాజిక వర్గాలను నిలుపుకోవడంలో పార్టీ ఫెయిల్ అయ్యిందని, ఈ విషయాన్ని అధినేతలు పట్టించుకోవడం లేదంటూ విమర్శలు గుప్పించారు. పార్లమెంట్ నియోజకవర్గాలకు అధ్యక్షులను నియమించడాన్ని కూడా ఆయన తప్పు పట్టడం దుమారం రేపింది. ప్రధానంగా లోకేశ్ టార్గెట్‌గా ఆయన విమర్శలు గుప్పించారు. తాను చంద్రబాబును కలిసే ప్రసక్తే లేదని, తన దగ్గరికి అధిష్టానం దూతలుగా వచ్చిన వాళ్లకు అన్నీ చెప్పానన్నారు. తన మాటగా చంద్రబాబుకు వివరిస్తారని చెప్పిన మాటపై బుచ్చయ్య నిలబడలేకపోయారు.
అధిష్టానం బెదిరింపులకో లేక మరే కారణాలో తెలియదు కానీ, బుచ్చయ్య మాత్రం లొంగిపోయారనే అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. బుచ్చయ్య ఆవేశ పడడం, మళ్లీ చల్లబడడం మామూలై పోయిందని ఆయన అనుచరులే చెబుతున్నారు. గతంలో ఎన్టీఆర్‌ను ముఖ్యమంత్రి పదవి నుంచి కూలదోసినప్పుడు చంద్రబాబును నానా తిట్లు తిట్టారని గుర్తు చేస్తున్నారు. ఆ రోజు తనను ఆడిపోసుకున్న బుచ్చయ్యను నేటికీ చంద్రబాబు మరిచిపోలేదని, అందుకే ఆయన్ను మంత్రి పదవికి దూరంగా పెట్టారని గుర్తు చేస్తున్నారు.
ప్రస్తుతం రాజకీయ చరమాంకంలో ఉన్న బుచ్చయ్య చౌదరి మరోసారి అలాంటి తప్పే చేశారని ఆయన అనుచరులు, అభిమానులు అంటున్నారు. ఇప్పుడు ప్రధానంగా లోకేశ్‌కు డ్యామేజీ కలిగించేలా మాట్లాడ్డం వల్ల, బుచ్చయ్య మనుషులుగా గుర్తింపు పొందిన వాళ్లకు టీడీపీలో శాశ్వతంగా నష్టం కలగనుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.
తనకు చివరి రోజుల్లో పొలిట్‌బ్యూరో సభ్యత్వం ఇచ్చారని పార్టీపై వ్యంగ్యంగా కామెంట్స్ చేయడం, జగన్‌ను పడగొట్టడం అంత ఈజీ కాదనడం, చంద్రబాబు వల్ల కమ్మ సామాజిక వర్గానికి తీరని నష్టం వాటిల్లిందని చెప్పడం లాంటి మాటలను వెనక్కి తీసుకోవడం… పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా ఆలోచనను ఉపసంహరించుకున్నంత సులభమా అని ప్రశ్నిస్తున్నారు.
అచ్చెన్నాయుడి అన్న కూతురైన ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ కుటుంబంపై చేసిన తీవ్ర ఆరోపణల మాటేమిటి బుచ్చయ్య అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. మంచోచెడో చంద్రబాబు, లోకేశ్‌లపై తన విమర్శలకు బుచ్చయ్య నిలబడి ఉంటే గౌరవం వుండేదని మెజార్టీ అభిప్రాయం.