వైఎస్ విజయమ్మ నిర్వహించిన వైఎస్ఆర్ సంస్మరణ సమావేశానికి కాంగ్రెస్ నుంచి ఎవరూ వెళ్లకూడదనే ఆంక్షలను పెట్టి, తన ఆదేశాలను కాంగ్రెస్ వాళ్లే పాటించరనే క్లారిటీని ఇచ్చుకున్నారు టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. ఈ వ్యవహారంలో చూసీచూడనట్టుగా ఉండి ఉంటే పోయేది.
అయితే రేవంత్ రెడ్డి మాత్రం తన మార్కు అతి చేయాలని ట్రై చేశారు. అభాసుపాలయ్యారు. రేవంత్ ఆంక్షలు పెట్టాడని చెప్పి కాంగ్రెస్ వాళ్లు అటు వైపు చూడకుండా ఉండలేదు. కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆ సమావేశానికి హాజరుకావడమే కాదు, పనిలోపనిగా రేవంత్ అండ్ బ్యాచ్ వ్యవహారాలపై కూడా కామెంట్ చేశారు.
తమ పార్టీ వాళ్లు కొందరు పక్క పార్టీ నేతలను కలిసి కాళ్లు మొక్కి వస్తున్నారని, అలాంటిది తను తమ పార్టీకి చెందిన దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి సంస్మరణ సమావేశానికి వెళితే తప్పేంటని ఎదురుప్రశ్నించారు కోమటిరెడ్డి. ఈ మాట ఎక్కడ తగలాలో అక్కడ తగిలిందని చెప్పవచ్చు. చంద్రబాబు కాళ్లు మొక్కిన కాంగ్రెస్ నేత సీతక్క విషయంలో రేవంత్ ను ఎద్దేవా చేశారు కోమటిరెడ్డి. అయినా సంస్మరణ సభకు హాజరు కాకూడదు? అనే షరతును ఎవరైనా విధిస్తారా? అని కూడా కోమటి రెడ్డి ప్రశ్నించారు.
ఇలా రేవంత్ రెడ్డి గాలి తీశారు ఈ ఎంపీ. ఏ వ్యవహారంలో అయితే ఆంక్షలు పెట్టకూడదో ఆ అంశంలోనే స్పందించి రేవంత్ రెడ్డి నవ్వులపాలయ్యాడు. ఇంకా తెలుగుదేశం నేత లాగే రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నట్టుగా ఉన్నాడనే అభిప్రాయాలు కూడా కాంగ్రెస్ హార్డ్ కోర్ అభిమానుల్లో కలిగించారు కూడా ఈ ఎపిసోడ్ తో!