సినీ నటుడు, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ‘మా’ ప్రస్తుత అధ్యక్షుడు నరేశ్ విందు రాజకీయానికి తెరలేపారు. త్వరలో ‘మా’ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయన వీకెండ్ పార్టీ ఏర్పాటు చేయడంపై టాలీవుడ్లో చర్చ జరుగుతోంది. హైదరాబాద్‌లో ఓ ప్రముఖ హోటల్లో నటీనటులకు ఆయన విందు ఇవ్వనున్నారని సమాచారం.
దసపల్లా ఫోరమ్ హాల్లో శనివారం సాయంత్రం 6 నుంచి పార్టీ జరగనుందని….శుక్రవారం అందరికీ ఆహ్వానం అందుతుందంటూ నరేశ్ విజయ కృష్ణ పేరుతో ఓ వాట్సాప్ మెస్సేజ్ వైరల్ అవుతోంది. దీంతో ‘మా’ ఎన్నికల్లో మరోసారి నరేశ్ అధ్యక్ష బరిలో నిలుస్తారా? అనే చర్చకు దారి తీసింది.
అధ్యక్ష బరిలో ఉంటాననడంతో పాటు తన ప్యానల్‌ను కూడా ఇప్పటికే ప్రకటించిన ప్రకాశ్‌రాజ్ స్థానికతపై నరేశ్ పరోక్షంగా విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు మంచు విష్ణుకు అనుకూలంగా నరేశ్ మద్దతు కూడగడుతున్నారనే ప్రచారం జరుగుతోంది. నటి హేమ తనపై చేసిన వ్యాఖ్యలపై క్రమశిక్షణ సంఘానికి నరేశ్ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
హేమకు క్రమశిక్షణ సంఘం వివరణ ఇవ్వాలని నోటీసులు కూడా ఇచ్చింది. ఎన్నికల షెడ్యూల్ రాకుండానే టాలీవుడ్లో రాజకీయ చిచ్చు రగులుతోంది. ఎన్నికల ప్రకటన వస్తే… ఎవరెవరు ఎటు వైపు అనేది స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి. అంత వరకూ ఇలాంటి విందు రాజకీయాలు మరిన్ని కొనసాగేలా ఉన్నాయి.