కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి విరుచుకుపడ్డారు. సింహాచలం అప్పన్న స్వామిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సింహాచలానికి సంబంధించిన 800 ఎకరాలకు పైగా ఆస్తులు పరాధీనం అవుతుంటే థర్మకర్తలు ఏం చేస్తున్నారని అశోక్ గజపతిరాజును ఆయన ప్రశ్నించారు.
పరాధీనం ఆస్తుల విలువ రూ.8 వేల కోట్లు అని ఆయన చెప్పారు. అశోక్‌గజపతిరాజు బయటకు నీతులు.. లోపల కుట్రలుంటాయని విరుచుకుపడ్డారు. అశోక్ గజపతిరాజు ధర్మకర్తనా.. లేక అధర్మకర్తా? అంటూ వ్యంగ్యంగా ప్రశ్నించారు. అక్రమాలు జరిగాయన్న దానిపై బహిరంగ చర్చకు తాను సిద్ధమని విజయసాయి రెడ్డి సవాల్ విసిరారు.
నిజంగా తాను తప్పు చేయలేదని అశోక్ గజపతిరాజు భావిస్తుంటే …. కోర్టుకు ఎందుకు వెళ్లారని విజయసాయిరెడ్డి నిలదీశారు. స్వార్థపూరితంగా మాన్సాస్ నిర్వహిస్తున్న వ్యక్తి అశోక్‌గజపతి అని విజయసాయిరెడ్డి ఆరోపించారు.
మాన్సాస్ ట్రస్ట్‌లో జరిగిన అవినీతిని త్వరలోనే బయటపెడతామని ఆయన చెప్పారు. దర్యాప్తు వేగవంతంగా జరుగుతోందని.. బాధ్యులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.