ఎంత వయసొచ్చినా ఇంకా కులం మీద మమకారం చావకపోవడం ఒక విడ్డూరం. పైగా ఆ కులం కంపుని పవన్ కళ్యాణ్ కి పూయాలనుకోవడం మరొక విచిత్రం.
ఎనిమిది పదుల వయసు దాటి సరిగ్గా నిలబడడానికి కూడా ఓపిక లేని చేగొండి హరి రామజోగయ్య “కాపు సంక్షేమ సేన” పేరుతో ఒక సభ ఏర్పాటు చేసి పవన్ కళ్యాణ్ మెప్పు పొందాలనుకున్నాడు. అది కూడా సరిగ్గా పవన్ పుట్టినరోజున.
పలువురిని పురమాయించి నగరంలో ఉన్న కాపు సినీ పెద్దలని పిలుచుకురమ్మనాడు. కానీ వెళితే ఏం జరుగుతుందో, ఏ బ్రాండ్ మీద పడుతుందో తెలిసిన ఎందరో ఎగ్గొట్టారు. వారిలో సినీ దర్శకుడు మారుతి కూడా ఉన్నారు.
సినీ రంగానికి చెందిన వారిలో బన్నీ వాస్ తప్ప ఇంకెవరూ కనపడలేదు. బన్నీ వాస్ ది పాలకొల్లు. హరిరామజోగయ్యది కూడా పాలకొల్లే. నచ్చకపోయినా కొన్ని తప్పవు. అందుకే అతను కూడా వెళ్లాడని చెప్తున్నారు.
అసలీ కులం కార్డ్ ప్లే చేసి ఈ పెద్దాయన ఈ వయసులో ఏం సాధించాలని? పవన్ కళ్యాణ్ మెప్పు ఆయనకెందుకు? అయినా ఎందుకు మెచ్చుకుంటాడు పవన్ మాత్రం?
పవన్ కళ్యాణ్ కాపే. కానీ జనసేనలో ఆయన పక్కనున్న నాదెండ్ల మనోహర్ కమ్మ. ఆయన సినీరంగ మిత్రుడు త్రివిక్రం శ్రీనివాస్ బ్రాహ్మణుడు. ఆయన భార్య రష్యన్. పవన్ కళ్యాణ్ కాపు కులం కోసం గిరి గీసుకుని కూర్చోలేదు. ఆయన నచ్చినట్టు, నచ్చిన వాళ్లతో జీవితం సాగిస్తారు.
ఈ హరిరామజోగయ్య తమ్ముడి కొడుకే గీత రచయిత అనంత్ శ్రీరాం. మరి కాపు కులాభిమాని అయితే పవన్ కళ్యాణ్ భీంలా నాయక్ పాట అతనిచేతే రాయించుకోవచ్చు కదా? అతన్ని పక్కన బెట్టి ఈ మధ్య రామజోగయ్య శాస్త్రితోటే ఎందుకు రాయించుకుంటున్నాడు పవన్?
ఒకానొక కులం పార్టీగా ముద్ర వేసే ఈ హరిరామజోగయ్య ఆలోచనల నుంచి పవన్ ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. లేకపోతే తెలుగుదేశాన్ని కమ్మ పార్టీ అన్నట్టుగా జనసేనకి కాపు పార్టీ అనే ముద్ర పడిపోతుంది. పార్టీ అధినేత కాపు కావచ్చు. కానీ జనసేన అందరి పార్టీ. కేవలం కాపులకి కాదు.
వెలగబెట్టాల్సినంత రాజకీయం వెలగబెట్టి ముసలి వయసులో ఓపిక లేని స్థితిలో ఇంట్లో కూర్చుని కృష్ణా రామా అనుకుని జీవితం సాగదీయాలి కానీ ఈ కులకంపు రాజకీయం చేస్తే ఎవ్వడూ మెచ్చడు. ఉన్న గౌరవాన్ని నేల నాకించుకుని నలుగురి చేతా ఛీ కొట్టించుకున్నట్టయ్యింది హరిరామజోగయ్యకి ఈ రోజు.
దయచేసి ఇలాంటి కులకంపు సభలు ఎవరైనా పెట్టి దానికి పవన్ కళ్యాణ్ పేరు వాడుకుంటే జనసైనికులంతా మందలించి టెంటు పీకేయమని ఒక పవన్ కళ్యాణ్ అభిమానిగా, జనసేన సానుభూతిపరుడిగా నా మనవి.
– కృష్ణకుమార్, పవన్ కళ్యాణ్ అభిమాని.