సినిమా టైటిల్స్ కోసం మేకర్స్ ఎంత కష్టపడతారో తెలిసిందే. ఆఖరి నిమిషం వరకు మంచి టైటిల్ కోసం కసరత్తులు చేస్తూనే ఉంటారు. చంద్రబాబు పరిస్థితి ఇప్పుడిలాగే ఉంది.
ఏపీలో పాదయాత్ర అయినా, ప్రజా యాత్ర అయినా.. ఆ పేరు చెబితే చాలు అప్పుడు వైఎస్సార్ గుర్తుకొచ్చేవారు, ఆ తర్వాత జగన్ గుర్తుకొస్తున్నారు. మధ్యలో చంద్రబాబు కూడా నేనున్నానంటూ ఓ యాత్ర చేశారు కానీ ఆయన్ని జనాలు గుర్తించలేదు, గుర్తు పెట్టుకోలేదు.
ఇప్పుడు మరోసారి అధికారం కోసం పాకులాడుతున్న చంద్రబాబు యాత్ర కోసం సిద్ధమవుతున్నారు. వయసు మీదపడినా ప్రజల కోసం యాత్ర చేస్తున్నారనే సింపతీ కోసమే బాబు దీనికి సిద్ధపడ్డారు. అందుకు ఓ మంచి సింపతీ టైటిల్ కావాలని నాయకులకు సూచించారట. దీని కోసం కొంతమంది సినిమావాళ్లని కూడా సంప్రదించారట.
తండ్రీ కొడుకులకు కామన్ టైటిల్..
రాబోయే ఎన్నికల కోసం వచ్చే ఏడాది నుంచి యాత్రలు చేయాలని ఆల్రెడీ నిర్ణయించుకున్నారు చంద్రబాబు-లోకేష్. ఈ మేరకు బాబు బస్సు యాత్ర చేయాలని, లోకేష్ తో పాదయాత్ర కమ్ సైకిల్ యాత్ర చేయించాలని ఫిక్స్ అయ్యారు.
ఈ అన్ని యాత్రలకు కామన్ గా ఓ పేరు పెట్టాలని అనుకుంటున్నారు. ఆ పేరు కోసమే ప్రస్తుతం పార్టీలో అంతర్గతంగా చర్చిస్తున్నారు. వయోభారం వల్ల బాబు బస్సుకే పరిమితం అవుతారు. లోకేష్ మాత్రం వాతావరణ, భౌగోళిక పరిస్థితుల బట్టి కొన్నిసార్లు పాదయాత్ర, మరికొన్నిసార్లు సైకిల్ యాత్ర చేస్తారట.
ఇదే చివరి యాత్ర..
కొడుకు చేతికి అంది వస్తే ఈపాటికే చంద్రబాబు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవాల్సిన సందర్భం. కానీ ఆయన అలా చేయలేకపోతున్నారు. ఇతర రాజకీయ నాయకుల్లా బాధ్యతలన్నీ వారసులకు అప్పగించి కృష్ణా, రామా అనుకోలేకపోతున్నారు. అందులోనూ పార్టీ పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. అందుకే ఆయన యాత్రలపై దృష్టిపెట్టారు.
ఇవే తనకు చివరి ఎన్నికలని కూడా చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో చెప్పబోతున్నారు. ఇంకోసారి మీ దగ్గరకు రాలేకపోవచ్చు, ఇవే నా చివరి ఎన్నికలు, చివరి అవకాశం ఇవ్వండి అంటూ వేడుకోబోతున్నారట. మరి బాబు బస్సు యాత్రకు, చినబాబు సైకిల్ యాత్రకు.. కామన్ గా పెట్టే ఆ సింపతీ టైటిల్ ఏమై ఉంటుందో చూడాలి.