బుచ్చయ్య రాజీనామా.. ఉన్న పరువు కూడా పోయింది

గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యవహారం టీ కప్పులో తుపానులా తేలిపోయింది. అయితే ఈ వ్యవహారంతో చంద్రబాబు చతురత మరోసారి నిరూపణ కాగా, బుచ్చయ్య ఇమేజి పూర్తిగా డ్యామేజీ అయిపోయింది. అంత సీనియారిటీ ఉన్న వ్యక్తి,…

గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యవహారం టీ కప్పులో తుపానులా తేలిపోయింది. అయితే ఈ వ్యవహారంతో చంద్రబాబు చతురత మరోసారి నిరూపణ కాగా, బుచ్చయ్య ఇమేజి పూర్తిగా డ్యామేజీ అయిపోయింది. అంత సీనియారిటీ ఉన్న వ్యక్తి, రాజీనామా చేస్తానని బాంబ్ పేల్చడం.. ఆ తర్వాత కొన్ని రోజులకు తూచ్ అని చెప్పడం ఆయన స్థాయికి తగ్గ పని కాదు. ఈ విషయంలో బుచ్చయ్య తన పరువు పోగొట్టుకున్నారు.

“ఇంత సీనియర్ ని నన్ను పార్టీలో ఎవరూ పట్టించుకోవడం లేదు, కనీసం నా ఫోన్ కూడా లిఫ్ట్ చేయడంలేదు, అధినేతతో మాట్లాడాలంటే కుదరడంలేదు, లోకేష్ కూడా నన్ను గుర్తించకపోతే ఎలా..? పార్టీకే కాదు, నా పదవికి కూడా రాజీనామా చేస్తా..” అంటూ అలిగిన బుచ్చయ్య చౌదరి.. అంతలోనే మెత్తబడ్డారు. 

టీడీపీలో  గోరంట్ల వ్యవహారం కలకలం సృష్టిస్తుందని అనుకున్నా, ఆయన వ్యవహార శైలి తెలిసినవారు మాత్రం అబ్బే.. బుచ్చయ్యకు అంత సీన్ లేదని అప్పుడే తేల్చేశారు. ఇప్పుడదే నిజమైంది, కాకపోతే కాస్త టైమ్ తీసుకున్నారంతే. రాజకీయాల్లో ఉన్నంత కాలం టీడీపీలోనే ఉంటా, టీడీపీతోనే ఉంటా అంటూ చల్లగా సెలవిచ్చారు సీనియర్ బుచ్చయ్య.

రాజకీయాల్లో రెండే రకాలుంటాయి. ఒకటి తిట్టి బయటకొచ్చేయాలి. లేదంటే తెరవెనక మంత్రాంగం నడిపి తమ పని కానిచ్చుకోవాలి. బుచ్చయ్య ఈ రెండు పనులూ చేయలేదు. అధిష్టానాన్ని తిట్టారు అంతలోనే మెత్తబడ్డారు. రాజమండ్రి అర్బన్ లో తనకు కావాల్సిన పనుల్ని ఆయన చేయించుకొని ఉండొచ్చు, చంద్రబాబు నుంచి కొన్ని హామీలు పొంది ఉండొచ్చు. అంతమాత్రానికే మీడియాకెక్కి రాజీనామా అంటూ హంగామా చేయడం బుచ్చయ్య స్థాయిని తగ్గించింది.

మంగళగిరిలోని పార్టీ ఆఫీస్ లో అధినేతతో ఏకాంత భేటీ అనంతరం బుచ్చయ్య మీడియాతో మాట్లాడారు. అయితే ఆ భేటీ వ్యవహారాన్ని అధిష్టానం తరపున ఎవరూ బయటపెట్టలేదు. చంద్రబాబు మీడియాతో ఆ విషయాన్ని చెప్పలేదంటే.. బుచ్చయ్యను ఆయన ఎంత లైట్ తీసుకున్నారో అర్థమవుతోంది. బయటకెళ్లిపోతా, అవమానం జరిగిందంటూ.. గోల గోల చేసిన బుచ్చయ్య మాత్రం బాబుని కలసి బయటకొచ్చిన తర్వాత తూచ్.. తూచ్.. అంటూ మాట మార్చారు.

ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?

టీడీపీలో బుచ్చయ్య చౌదరి ఎపిసోడ్.. అటు పార్టీకి కానీ, ఇటు ఆయనకి కానీ ఏమాత్రం ఉపయోగపడని వ్యవహారంగా తేలిపోయింది. కాకపోతే.. ఒక్కసారి అలిగి బయటికెళ్తానంటూ బెదిరించారు కాబట్టి, ఆయనతో పార్టీ మరింత జాగ్రత్తగా ఉంటుంది. అలగడం అలవాటైంది కాబట్టి.. స్వపక్షంలో ఉన్నా విపక్షంలాగే ఇకపై బుచ్చయ్య వ్యవహరించబోతున్నారని తెలుస్తోంది. 

పార్టీ బాగు కోసం తన రాజీనామా నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నాని చెప్పడమే ఇక్కడ కొసమెరుపు. ప్రస్తుతానికైతే బుచ్చయ్య తన పంతం నెగ్గించుకొని ఉండొచ్చు. కానీ రాబోయే రోజుల్లో మాత్రం పార్టీలో ఆయనకు కష్టకాలమే. మరీ ముఖ్యంగా లోకేష్ తో ఆయన ఎలా సర్దుకుపోతారో చూడాలి.