భర్తను హత్య చేయాలని నిర్ణయించుకున్న ఆ ఇల్లాలు, తన భవిష్యత్తు గురించి ఆలోచించింది. అందుకే ముందుజాగ్రత్తగా భర్త పేరిట 20 లక్షలకు ఇన్సూరెన్స్ పాలసీ తీసుకొని మరీ హత్యచేసింది. వరంగల్ జిల్లాలో జరిగిన ఈ హత్య కేసును పోలీసులు చాకచక్యంగా ఛేదించారు.
వరంగల్ రూరర్ పర్వతగిరి మండలానికి చెందిన వీరన్న స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ పాఠశాలలో చిన్న ఉద్యోగం చేసేవాడు. లాక్ డౌన్ వల్ల స్కూల్ మూతపడ్డంతో ఖాళీ బీరు సీసాలు, మద్యం సీసాలు అమ్ముతూ జీవనం సాగిస్తున్నాడు. అయితే ఇంట్లో ఎప్పుడూ గొడవ పడే వీరన్నను వదిలించుకోవాలనుకుంది అతడి భార్య యాకమ్మ.
తన సమీప బంధువులైన మరో ఇద్దరితో కలిసి హత్యకు కుట్రపన్నింది. అయితే వీరన్న చనిపోయిన తర్వాత ఎలా బ్రతకాలనే ఆలోచన కూడా చేసింది యాకమ్మ. అందుకే భర్త బతికుండగానే అతడి పేరిట 20 లక్షలకు లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంది. తర్వాత తన బంధువులు ఇద్దరితో కలిసి వీరన్నను హత్యచేసింది.
హత్య కేసును నమోదుచేసిన పోలీసులకు ఏం జరిగిందో అర్థంకాలేదు. సీసీటీవీ ఫూటేజ్ చూసిన తర్వాత యాకమ్మపై అనుమానం వచ్చింది. ఆమెతో పాటు మిగతా ఇద్దర్ని కూడా అరెస్ట్ చేసి తమదైన శైలిలో ప్రశ్నిస్తే అంతా కలిసి నిజం ఒప్పుకున్నారు.
అయితే ఈ హత్య కేసులో ఓ సాఫ్ట్ కార్నర్ కూడా ఉంది. ఇంటికి బాగా తాగొచ్చే వీరన్న, భార్యను విపరీతంగా కొట్టేవాడట. కన్నకూతురుతో కూడా అసభ్యంగా ప్రవర్తించేవాడట. ఈ ఆగడాలు భరించలేకనే భర్తను హత్యచేసిందట యాకమ్మ. ప్రస్తుతం ఈ హత్యపై వరంగల్ లో జోరుగా చర్చ నడుస్తోంది. చాలామంది యాకమ్మ చేసిన హత్యను సమర్థించడం విశేషం.