పోలీసోలన్ని, రవాణా శాఖ ఉద్యోగులను దబాయించడం.. నోటికొచ్చినట్టుగా మాట్లాడటం, ఆ తర్వాత తమ తిట్లను వాళ్లు ఆనందంగా స్వీకరిస్తారని సమర్థించుకోవడమే తప్ప.. ఏనాడూ ఇలా జైళ్లను చూసి ఉండరు జేసీ ప్రభాకర్ రెడ్డి. ఇప్పుడు కాదు.. పన్నెండేళ్ల కిందటే.. రవాణా శాఖలో ఒక ఉన్నతాధికారిని ప్రభాకర్ రెడ్డి దూషించిన తీరు అప్పట్లో చర్చనీయాంశంగా నిలిచింది. తమ బస్సులకు పర్మిట్ల విషయంలో ఏవో అభ్యంతరాలు చెప్పారని ఆ అధికారిని ప్రభాకర్ రెడ్డి తీవ్రంగా దూషించారు. ఎంతలా అంటే.. ఒక కులం పేరును, ఆ కులవృత్తిని ప్రస్తావిస్తూ ప్రభాకర్ రెడ్డి దూషించారు.
వాస్తవానికి సదరు అధికారి ఆ కులానికి చెందిన వ్యక్తి కాదు. కానీ ప్రభాకర్ రెడ్డి అధికారులు అలా అడ్డుకుంటేంటే, మరో కులవృత్తిని కించపరుస్తూ, దూషించారు. దానిపై కొన్నాళ్లు దుమారం రేగింది. ఆ తర్వాత అంతా మామూలే. అప్పటి నుంచి అధికారం చేతిలో ఉంది కదా.. అని రోడ్డు మీద టెంటు వేసుకుని నోటికొచ్చిన బూతులు తిట్టేంత వరకూ వచ్చారు ప్రభాకర్ రెడ్డి.
ప్రస్తుతానికి ఆయన పోలీసుల అదుపులో ఉన్నారు. హైదరాబాద్ లో అరెస్టు చేసి, ఆయననూ, ఆయన కొడుకును అనంతపురం తీసుకొచ్చారు. అక్కడ జైలు రెడ్ జోన్లో ఉండటంతో.. కడప జైలుకు తీసుకెళ్లారు. ఆ తర్వాత విచారణకు అంటూ అనంతపురం తీసుకొచ్చారు. ఆ పై మళ్లీ కడపకు తరలించారు. ఇలా అనంతపురం-కడప మధ్యన షటిల్ సర్వీస్ చేస్తున్నారు ప్రభాకర్ రెడ్డి, ఆయన తనయుడు అస్మిత్. వీళ్లు వయా తాడిపత్రి మీదే ప్రయాణిస్తూ ఉన్నారో లేక అధికారులు దారి మళ్లిస్తున్నారో కానీ.. విచారణలో వీళ్లు రకరకాల విషయాలను చెబుతున్నారట. వాళ్లు చెబుతున్న విషయాల ప్రకారం నేరం జరిగిందని స్పష్టం అవుతోందని విచారణాధికారులు వ్యాఖ్యానిస్తూ ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి.