ఏపీ స్టేట్ ఎన్నికల కమిషనర్ గా వ్యవహరించి, ప్రస్తుతం మళ్లీ ఆ సీట్లోకి రావడానికి చట్టబద్ధ పోరాటం చేస్తున్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు సంబంధించి మరో వివాదం రేగింది. ఇప్పటికే తనను తాను ఎస్ఈసీగా నియమించుకుని, ఎస్ఈసీకి సంబంధించిన కొందరు వ్యక్తుల రాజీనామాలను కోరి వివాదంలోకి ఎక్కారు నిమ్మగడ్డ. ప్రస్తుతం ఈ వ్యవహారం అంతా సుప్రీం కోర్టులో విచారణ జరుగుతూ ఉంది. ఈ క్రమంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాజకీయ నేతలతో సమావేశం అయ్యారనే ప్రచారం ఊపందుకుంది. ఈ మేరకు సోషల్ మీడియాలో, టీవీ చానళ్లలో వీడియోలు ప్రసారం అవుతున్నాయి.
తెలుగుదేశం పార్టీ తరఫున రాజ్యసభకు ఎన్నికై, ఆ పై బీజేపీలో చేరిన సుజనా చౌదరి, ఏపీ మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ లతో హైదరాబాద్ లోని పార్క్ హయాత్ లో నిమ్మగడ్డ రమేష్ కుమార్ సమావేశం అయ్యారని ప్రచారం జరుగుతూ ఉంది. వీరు ఒకరి వెనుక ఒకరు ఆ హోటల్ లోకి వెళ్లడానికి సంబంధించి సీసీ టీవీ ఫుటేజ్ లు సోషల్ మీడియాలో ప్రసారం అవుతున్నాయి. ఆ హోటల్లో వీరు ఒక గదిలో సుమారు గంటన్నర పాటు సమావేశం అయ్యారని ప్రచారం జరుగుతూ ఉంది.
గమనించాల్సిన అంశం ఏమిటంటే..ఎస్ఈసీగా నిమ్మగడ్డ కొనసాగాలంటూ పిటిషన్ వేసిన వారిలో కామినేని శ్రీనివాస్ కూడా ఒకరు. ఆయన పిటిషన్ వేయడం సంగతలా ఉంటే.. ఎస్ఈసీ హోదాను కోరుకుంటున్న ఒక వ్యక్తి, ఆ హోదాలో ఇప్పటికే పని చేసిన ఒక వ్యక్తి.. ఇలా రాజకీయ నేతలతో రాసుకుపూసుకు తిరగడం మాత్రం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ సమావేశం దుమారం రేపుతూ ఉంది.
చంద్రబాబు నాయుడు ప్రయోజనాల మేరకే నిమ్మగడ్డ రమేష్ కుమార్ పని చేస్తూ వచ్చారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తూ ఉంది. ఈ విషయంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కూడా కుండబద్ధలు కొట్టినట్టుగా మాట్లాడారు. ఇలాంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడుకు సన్నిహితులుగా పేరు పొందిన సుజనాచౌదరి, కామినేని శ్రీనివాస్ లతో నిమ్మగడ్డ సమావేశం అయ్యాడనే వార్తలు ఆసక్తిని రేపుతూ ఉన్నాయి. నిమ్మగడ్డపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరింత తీవ్రంగా విరుచుకుపడుతూ ఉంది. చంద్రబాబు సన్నిహితులతో ఇలా ప్రైవేట్ మీటింగుల్లో పాల్గొనే ఆయన ఎలా పారదర్శంగా వ్యవహరించగలరని వైసీపీ వాళ్లు ప్రశ్నిస్తున్నారు.