కాంగ్రెస్ సీనియర్ నేత, వైఎస్సార్ ఆప్త మిత్రుడు కేవీపీ రామచంద్రరావు ఓ విషయమై స్పష్టత ఇచ్చారు. వైఎస్సార్ 12వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్‌లో ఆయన సతీమణి విజయమ్మ ఆత్మీయ సభ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ సభకు రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన సుమారు 400 మందిని ఆహ్వానించినట్టు వార్తలొస్తున్నాయి. ఆహ్వానం అందుకున్న వారిలో రాజకీయ, సినీ రంగ ప్రముఖులు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా కేవీపీ రామచంద్రరావు గురువారం మీడియాతో మాట్లాడుతూ విజయమ్మ ఆత్మీయ సభకు వెళ్లడంపై తేల్చి చెప్పారు.
తనకు వైఎస్ విజయమ్మ నుంచి ఆహ్వానం అందిందని, వెళ్తున్నానని స్పష్టం చేశారు. ఈ సమావేశం ఎందుకు నిర్వహిస్తున్నారని కేవీపీని మీడియా ప్రశ్నించగా… అది తనను కాదని, ఆమెను అడగాల్సిన ప్రశ్న అని సమాధానం ఇచ్చారు.
వైఎస్సార్ ఎప్పటికీ కాంగ్రెస్ నాయకుడేనని ఆయన పేర్కొన్నారు. ఇవాళ సాయంత్రం విజయమ్మ నేతృత్వంలో నిర్వహించే ఆత్మీయ సమావేశానికి ప్రాధాన్యం సంతరించుకుంది. రాజకీయ పార్టీలకు అతీతంగా ఆమె ఆహ్వానించారు.
గతంలో వైఎస్సార్ కేబినెట్‌లో పనిచేసిన మంత్రులు, అలాగే ఆయనతో కలిసి రాజకీయ ప్రయాణం సాగించిన వాళ్లకు విజయమ్మ ఆహ్వానాలు పంపిన సంగతి తెలిసిందే. రాజకీయేతర సమావేశమని విజయమ్మ చెబుతున్నప్పటికీ, రాజకీయాల చుట్టూ ఆ సమావేశం ప్రదక్షిణ చేస్తుండడం గమనార్హం.