కరోనా జనజీవనంలో భాగం అయిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. దేశంలో ప్రతి రోజూ వేల సంఖ్యలో కేసులు పెరుగుతూ ఉన్నాయి. ఈ పెరుగుదల ఏ స్థాయికి వెళ్తుంది? అనేది ఇంకా ప్రశ్నార్థకమే. కరోనా రికవరీ రేటు మెరుగ్గా ఉన్నా, కొత్త కొత్త మందులు అందుబాటులోకి వస్తున్నా.. కరోనా నిస్సందేహంగా ఇంకా విపత్తే. నిఖార్సైన సూదిమందు వచ్చే వరకూ.. ఎవరికి వారు కేర్ తీసుకోవడమే తప్ప మరో మార్గం కనిపించడం లేదు. ఈ క్రమంలో.. మరోసారి చెప్పుకోవాల్సిన అంశం ఏమిటంటే.. భౌతిక పరమైన దూరంతోనే కరోనాను నివారించవచ్చనేది. కరోనా సోకకూడదంటే కొన్ని అలవాట్లను తప్పనిసరిగా చేసుకోవాలని స్పష్టం అవుతోంది. అవేమిటంటే…
-నోమోర్ హ్యాండ్ షేక్స్, హగ్స్
ఇప్పుడిప్పుడే సామాజికంగా జనాలు మళ్లీ కలవడం మొదలవుతూ ఉంది. తక్కువమందితోనే అయినా పెళ్లిళ్లు జరుగుతున్నాయి. సోషల్ గేదరింగ్స్ పెరుగుతున్నాయి. అయితే జాగ్రత్తలు తీసుకోకపోవడం మాత్రం మంచిది కాదు. ఇలాంటి వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. తప్పక అటు వైపు వెళ్లినా హ్యాండ్ షేక్స్ కు, హగ్స్ కు దూరం తప్పనిసరి.
-భౌతిక దూరం తప్పనిసరి..
రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. అంతా ఇళ్లలో కూర్చుంటే జరగదు. అనేక మంది బతుకుబండి నడవాలంటే రోడ్డెక్కకతప్పదు, అనేక మందిని కలవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో వాళ్లను వారు రక్షించుకోవడం కూడా ముఖ్యమే. మన పని మీదే వెళ్లినా మొహమాటాలకు వెళ్లకుండా అలాంటి మీటింగుల్లో కనీసం ఆరు అడుగుల దూరం పాటించడాన్ని మాత్రం తప్పనిసరి చేసుకోవాలి. ఎదుటి వారు ఏమనుకున్నా ఫర్వాలేదు.. రెండు గజాల భౌతిక దూరం పాటించడం అనేది జీవన సూత్రమంత కీలకమైనది!
-మాస్క్ ల మీద శ్రద్ధ పెట్టాలి..
మాస్క్.. కరోనా నుంచి చాలా వరకూ రక్షణగా పనికి వస్తుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. మాస్క్ ఒక్కటే 80 శాతం వరకూ రక్షిస్తుందని కూడా కొందరు అంటున్నారు. ఇప్పటికే అంతా మాస్క్ ను తప్పనిసరిగా వాడుతున్నట్టుగా కనిపిస్తున్నారు. అయితే.. నాణ్యమైన మాస్క్ ను ఉపయోగించుకోవడం, ఇళ్లలోనే తయారు చేసుకున్నా.. వాటిని కూడా రెగ్యులర్ గా మార్చుకోవడం.. వంటివి కూడా అలవాటుగా మార్చుకోవాలి.
-మొహాన్ని టచ్ చేయడం మానేయాలి..
ఇది చాలా మంది కష్టమే. మూతినో, ముక్కునో టచ్ చేసుకుంటూ ఉండటం, కళ్లను రద్దుకుంటూ ఉండటం, క్రాప్ సరి చేసుకుంటూనే ఉండటం.. ఇవన్నీ మనిషి అనునిత్యం చేసేవే. ఒక్కోరిలో ఈ అలవాట్లు ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ విషయంలో నియంత్రించుకోవాలని, చేతులను మొహం మీదకు తీసుకెళ్లడం అంటే వైరస్ లను శరీరంలోకి తీసుకెళ్లడమే అనే విషయాలను గ్రహించాలని నిపుణులు వివరిస్తున్నారు.
-తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు..
వేరే వాళ్తు తుమ్మితేనో, దగ్గితేనే భయపడటమే కాకుండా, మీరు తుమ్మినా, దగ్గినా కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం ఇప్పుడు తప్పనిసరి. తప్పనిసరిగా కర్చిఫ్ లేదా, టిష్యూ ఉపయోగించడంతో పాటు.. ఆ వెంటనే చేతులను శానిటైజ్ చేసుకోవడం కూడా తప్పనిసరి చేసుకోవాలని చెబుతున్నారు.
-చేతులు శుభ్రపరుచుకోవడం..
బయటకు వెళ్లి వచ్చిన ప్రతిసారీ, ఇంట్లోకి దేన్నైనా తీసుకు వచ్చిన వెంటనే..దాన్ని నీళ్లతో కడుక్కోవడంతో పాటు.. మీ చేతులను కూడా శుభ్రంగా
చేసుకోవడం గురించి వేరే చెప్పనక్కర్లేదు. ఇది ఈ పాటికే తప్పనిసరి అలవాటుగా మారి ఉండాలి. లేకపోతే అలవాటుగా మార్చుకోవాల్సిందే.
-బయట ఉమ్మడం శిక్షార్హం
ఇప్పటికీ ఇండియాలో ఈ అలవాటు మాత్రం పోలేదు. బహుశా పోదు కూడానేమో! పాన్ నమిలే వాళ్లు, బయట ఉమ్మే వాళ్లకు కొదువ ఉండదు. వీళ్లను ఏం చేసినా పాపం లేదు. ఇప్పటికే పలు రాష్ట్రాలు మొత్తుకుని చెబుతున్నాయి.. బయట ఉమ్మేస్తే శిక్షిస్తామని అంటున్నాయి. మనుషుల్లో పరివర్తన రావాలి.
-శుభ్రతే మంత్రం
బయట నుంచి తెచ్చుకున్న కాయగూరలను అయినా, చికెన్-మటన్ ను అయినా, మరేదాన్ని అయినా.. శుభ్రం చేసుకోవడం తప్పనిసరి. అలాగే ఇంటిని, పరిసరాలను కూడా శుభ్రం చేసుకోవడం మీద దృష్టి పెట్టాలి.
-వెకేషన్లకు, విహారాలకూ విరామం
అనవసరమైన ప్రయాణాలను ఎంత మానుకుంటే అంత మంచిది. వెకేషన్లకు, విహారాలకు ఇది విరామ సమయం అని గ్రహించాలి.
-వైరస్ తో పోరాడాలి, రోగులతో కాదు..
కరోనా వైరస్ భయాలు మనుషుల మధ్య గొడవలను కూడా పెడుతున్నాయంటే నమ్మడం కష్టమేమీ కాదు. ఎక్కడో ఎవరికో కరోనా వస్తే.. తమ ఇంట్లో అద్దెకున్న వాళ్లు ఈ మధ్యనే వాళ్లింటికి వెళ్లి వచ్చారని చెప్పి వీరితో గొడవ పెట్టుకుంటున్న, ఖాళీ చేయిస్తున్న హౌస్ ఓనర్లు ఇప్పటికే వెలుగులోకి వచ్చారు. జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది కానీ, ఇది పద్ధతి కాదేమో!
-కరోనా గురించి తెలుసుకోవాలి..
కరోనా వైరస్ వ్యాప్తి గురించి తెలుసుకోవడం ప్రతి ఒక్కరి ధర్మం. అలాగని 24గంటల వార్తా చానళ్లకు అతుక్కుపోవడం ఆరోగ్యానికే మంచిది కాదు. కరోనా గురించి సమస్త సమాచారంతో కేంద్ర ప్రభుత్వం ఆరోగ్యసేతు యాప్ ను, వెబ్ సైట్ ను ఇచ్చింది దాన్ని ఫాలో అవుతుంటే చాలు.
-హెల్ప్ లైన్ నంబర్లు..
1075 ఇది కేంద్ర హెల్ప్ లైన్ నంబర్. అనుమానిత, అత్యవసర సమయాల్లో ఈ నంబర్ కు డయల్ చేయవచ్చు. అలాగే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రత్యేక సహాయ వాణితో అందుబాటులో ఉంటాయి.
-ఫైనల్ గా సోషల్ మీడియాతో జాగ్రత్త
సోషల్ మీడియాలో పైత్యకారుల గురించి వివరించక్కర్లేదు. ఒకడేమో కరోనా వస్తే అంతే అంటాడు, ఇంకోడు ఏమీ కాదుపొండని చెబుతాడు. ఎవడో చెబితే కాకుండా.. ప్రతి మనిషికీ తన ఇంగితం అంటూ ఒకటి ఉంటుంది. సోషల్ మీడియాలో అడ్డగోలు పోస్టులను చదివేసి నమ్మేయడం , అరకొర జ్ఞానంతో వాటిని షేర్ చేసేసి స్ప్రెడ్ చేసేయడం ఆపితే మంచిది. అలాగే మీరే పోస్టులు పెడుతున్నప్పుడు ఏం పోస్టు చేస్తున్న విషయాన్నీ కాస్త ఆలోచిస్తే మరింత మంచిది.